న్యూఢిల్లీ: ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లను అందించేందుకు, సప్లయ్ చెయిన్ అవసరాలను తీర్చేందుకు అదానీ గ్రూప్ చైనాలో ఓ సబ్సిడరీని ఏర్పాటు చేసింది. తమకు చెందిన సింగపూర్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అదానీ ఎనర్జీ రిసోర్సెస్ (షాంఘై) (ఏఈఆర్‌సీఎల్) పేరుతో ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీని చైనాలో ఏర్పాటు చేసిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కంపెనీ హెడ్‌క్వార్టర్ షాంఘైలో ఉంటుంది. అదానీ గ్లోబల్ పీటీఈ దీనిని ఏర్పాటు చేసింది. చైనా చట్టాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 2 న ఏఈఆర్‌సీఎల్‌ను ఏర్పాటు చేశామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది.
ఈ ఫ్లాగ్‌షిప్ కంపెనీ కెన్యాలో ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పీఎల్‌సీ పేరుతో ఓ సబ్సిడరీని ఏ ర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది ఏర్పాటైన కొన్ని రోజులకే చైనాలో మరో సబ్సిడరీ కంపెనీని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు చేసింది. ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పీఎల్‌సీ ఆఫ్రికన్ దేశాల్లో ఎయిర్‌పోర్టులను డెవలప్, మేనేజ్ చేస్తుంది. ఇండియాకు వెలుపల ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించడానికి, ఆపరేట్ చేయడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ గతంలో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ఎల్‌ఎల్‌సీని ఏర్పాటు చేసింది. దీని బేస్ అబుధాబిలో ఉంది. ఈ కంపెనీనే కెన్యాలో తాజాగా సబ్సిడరీ పెట్టింది.