
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎమార్ గ్రూప్‌కి చెందిన ఇండియా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. 1.4 బిలియన్ డాలర్ల (రూ.12 వేల కోట్ల) వాల్యుయేషన్ దగ్గర ఇరు కంపెనీల మధ్య డీల్ కుదిరే అవకాశం ఉంది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, డీల్‌లో భాగంగా అదానీ రియల్ ఎస్టేట్ 400 మిలియన్ డాలర్ల (రూ.3,500 కోట్ల)ను కంపెనీలో ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే నెలలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి.
ఎమార్ ఇండియా లిమిటెడ్‌లో కొంత వాటాను అమ్మేందుకు అదానీ గ్రూప్‌తో సహా ఇండియా బిజినెస్‌లతో చర్చలు జరుపుతున్నామని ఈ ఏడాది జనవరిలో ఎమార్ గ్రూప్ ప్రకటించింది. కాగా, అదానీ గ్రూప్ ముంబైలో అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్‌ను రీడెవలప్ చేసేందుకు ఈ నెల ప్రారంభంలో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు సుమారు రూ.36 వేల కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు ముంబై ధారావి స్లమ్‌ను రీడెవలప్ చేసే ప్రాజెక్ట్‌ను కూడా ఈ గ్రూప్ దక్కించుకుంది. ఎమార్‌లో వాటాలు కొంటే కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత విస్తరిస్తుంది. దుబాయ్‌కు చెందిన ఎమార్ గ్రూప్ ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కడుతోంది.