
- 2022–23 లో రూ.46,610 కోట్లు
- డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌లు కలిపి ప్రభుత్వానికి భారీగా చెల్లింపులు
- ట్యాక్స్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్ విడుదల
న్యూఢిల్లీ: పోర్టుల నుంచి కరెంట్ ఉత్పత్తి వరకు వివిధ బిజినెస్‌లలో ఉన్న అదానీ గ్రూప్ 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.58,104 కోట్ల ట్యాక్స్ కట్టింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ.46,610 కోట్ల ట్యాక్స్‌తో పోలిస్తే ఇది రూ.11,494 కోట్లు ఎక్కువ. ఈ అమౌంట్‌లో గ్లోబల్ ట్యాక్స్‌లు, సుంకాలు, ఇతర ఛార్జీలు వంటి డైరెక్ట్ ట్యాక్స్‌లు, ఉద్యోగుల బెనిఫిట్స్‌పై చెల్లించిన లెవీలు, ఇతర స్టేక్‌హోల్డర్ల తరపున కట్టిన సుంకాలు వంటి ఇండైరెక్ట్ ట్యాక్స్‌లు కలిసి ఉన్నాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ట్యాక్స్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ‘కిందటి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.58,104.4 కోట్ల ట్యాక్స్‌ను చెల్లించాం. గ్రూప్ కంపెనీలు చెల్లించిన పన్నులు ఇందులో కలిసి ఉన్నాయి’ అని అదానీ గ్రూప్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అదానీ గ్రూప్ నుంచి ఏడు కంపెనీలు మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. అవి అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్. ఈ కంపెనీలు విడుదల చేసిన ఇండిపెండెంట్ రిపోర్ట్‌లోని అంశాలు తాజా ట్యాక్స్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌లో కలిసి ఉన్నాయి.
అంతేకాకుండా మరో మూడు లిస్టెడ్ సబ్సిడరీ కంపెనీలు ఎన్‌డీటీవీ, ఏసీసీ, సంఘీ ఇండస్ట్రీస్ చెల్లించిన ట్యాక్స్‌లు కూడా పైన పేర్కొన్న ట్యాక్స్ అమౌంట్‌లో కలిసి ఉన్నాయి. ‘ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ట్యాక్స్ కడుతున్నాం. మేము ప్రభుత్వానికి చెల్లించే ప్రతీ రూపాయి మా నిబద్ధత, పారదర్శకతకు నిదర్శనం. వాలంటరీగా ఈ వివరాలను బయటపెట్టడం ద్వారా మాపై స్టేక్‌హోల్డర్ల నమ్మకాన్ని పెంచుకోవాలని చూస్తున్నాం. ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాం’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. పన్నుల విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని, ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషియల్, గవర్నెన్స్) ఫ్రేమ్‌వర్క్ తమ కార్యకలాపాల్లో భాగమైందని అదానీ గ్రూప్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇన్నోవేషన్లకు ప్రాధాన్యం ఇస్తూనే దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మార్చాలని టార్గెట్ పెట్టుకున్నామని, సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫాలో అవుతూనే వృద్ధి చెందడానికి పాటుపడతామని వివరించింది. కాగా, ట్యాక్స్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌లను కంపెనీలు పబ్లిష్ చేయడం తప్పనిసరి కాదు. మరోవైపు 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1.86 లక్షల కోట్లను వివిధ ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. రిలయన్స్ 48 వ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ.1.77 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.9 వేల కోట్లు ఎక్కువ.