భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కీలక పాత్ర: మంత్రి శ్రీధర్ బాబు

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ద్రిష్టి 10యూఏవీ ఆవిష్కరించడం ఎంతో సంతోషించదగ్గ విజయమన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.  గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలోనే రక్షణ రంగానికి సంబంధించిన ఆవిష్కరణలు అవుతున్నాయని అన్నారు. జనవరి 10వ తేదీ బుధవారం  తుక్కుగూడలోని అదాని ఏరోస్పేస్ లో ద్రిష్టి 10యూఏవిని  నౌకాదళ చీఫ్ హరి కుమార్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 6-7 దశాబ్దాల క్రితం అప్పటి కేంద్ర ప్రభుత్వాలు... హైదరాబాదులో డిఆర్ డిఓ,  ఆర్ సిఐ లాంటి ప్రభుత్వ రక్షణ రంగా సంస్థలను ఏర్పాటు చేశారని... దానివల్ల ఇప్పుడు హైదరాబాద్ లో రక్షణ రంగానికి చెందిన ప్రవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమని.. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. 

ఏరోస్పేస్ రంగంలో తయారీ,  ఇతర సాంకేతిక పరంగా హైదరాబాద్ ఎంతో ముందుందన్నారు. అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ ను అభినందిస్తున్నామని.. భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ గ్రూప్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు మా ప్రభుత్వం సిద్దంగా ఉందని.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.