వచ్చే ఏడాది అదానీ రాగి ఫ్యాక్టరీ స్టార్ట్​

వచ్చే ఏడాది అదానీ రాగి ఫ్యాక్టరీ స్టార్ట్​

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్  రాగి ఉత్పత్తి ఫ్యాక్టరీ గుజరాత్‌‌లోని ముంద్రాలో వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనివల్ల మనదేశం రాగి దిగుమతులపై  ఆధారపడటం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.   రాగిని "మెటల్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్" అని పిలుస్తారు. కరెంటు సరఫరాలో ఇది కీలకం. వైర్లు ప్రధానంగా రాగితో తయారవుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు), ఛార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, సోలార్ ఫోటో వోల్టాయిక్స్ (పీవీ),   బ్యాటరీలు వంటి శక్తి పరివర్తన (ఎనర్జీ ట్రాన్సిషన్​కు )టెక్నాలజీలకు రాగి కీలకం.  

అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్​) అనుబంధ సంస్థ  కచ్ కాపర్ లిమిటెడ్ (కేసీఎల్​) రెండు దశల్లో సంవత్సరానికి మిలియన్ టన్నుల రాగి ఉత్పత్తి కోసం గ్రీన్‌‌ ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్ట్‌‌ను ఏర్పాటు చేస్తోంది. ఫేజ్-1లో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నులు తయారు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొదటి దశ పూర్తవుతుంది. కాపర్​ ప్రాజెక్టు కోసం సంస్థ ఎస్​బీఐ కన్సార్టియం నుంచి రూ. 8,783 కోట్ల అప్పు తీసుకుంది. - ఫేజ్-1 కోసం మొత్తం రూ. 6,071 కోట్లు ఖర్చు పెడతారు. ప్రాజెక్ట్ కోసం ఈక్విటీని అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టింది. 

ఉక్కు,  అల్యూమినియం తర్వాత అత్యధికంగా ఉపయోగించే మూడవ పారిశ్రామిక మెటల్ రాగి.  వేగంగా అభివృద్ధి చెందుతున్న రెన్యువబుల్​ ఎనర్జీ, టెలికాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశ్రమలు ఇవి విరివిగా వాడుతున్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం   భారతదేశం రికార్డు స్థాయిలో 1,81,000 టన్నుల రాగిని దిగుమతి చేసుకుంది. అయితే ఎగుమతులు రికార్డు స్థాయిలో 30 వేల టన్నులకు పడిపోయాయి. దేశం 2023 ఆర్థిక సంవత్సరంలో 7,50,000 టన్నుల రాగిని వినియోగించినట్లు అంచనా.  గ్రీన్ ఎనర్జీ పరిశ్రమ నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో 2027 నాటికి ఈ సంఖ్య 1.7 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.