- సంస్థల మార్కెట్ క్యాప్ రూ. 2.19 లక్షల కోట్లు డౌన్
- అమెరికాలో అవినీతి కేసే కారణం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు హిండెన్‌బర్గ్ లాంటిదే మరో షాక్ తగిలింది. సోలార్ కాంట్రాక్టుల కోసం రూ.2,100 కోట్లు లంచాలు ఇచ్చినట్టు అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ గ్రూపు పది లిస్టెడ్ సంస్థల మార్కెట్ వాల్యుయేషన్ గురువారం రూ. 2.19 లక్షల కోట్లు పడిపోయింది. గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 23 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.80 శాతం నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 13.53 శాతం క్షీణించగా, అంబుజా సిమెంట్స్ 11.98 శాతం పతనమైంది. అదానీ టోటల్గ్యాస్10.40, అదానీ విల్మార్ షేర్లు 9.98 శాతం, అదానీ పవర్ 9.15 శాతం, ఏసీసీ 7.29 శాతం, ఎన్డీటీవీ షేర్లు 0.06 శాతం క్షీణించాయి. కొన్ని గ్రూప్ సంస్థల షేర్లు లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి.
మొత్తం పది లిస్టెడ్ గ్రూప్ సంస్థల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.2,19,878.35 కోట్ల మేర క్షీణించింది. గురువారం నాటి మార్కెట్ పతనానికి అదానీ గ్రూప్ లంచం ఆరోపణలు కూడా కారణమని, ఈ వార్తలు దాని గ్రూప్ స్టాక్‌లలో భారీ అమ్మకాలను ప్రేరేపించాయని ప్రశాంత్ తాప్సే అనే ఎనలిస్టు తెలిపారు. భారతదేశంలోని రెండవ అత్యంత సంపన్నుడైన అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌తో సహా మరో ఏడుగురిపై ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు చెల్లించినట్టు అమెరికాలో కేసు నమోదయింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అక్కడి ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకుపైగా సేకరించినట్లు సెక్యూరిటీస్ అండ్ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది.
600 మిలియన్ల బాండ్ ఇష్యూ రద్దు
అమెరికాలో కేసు కారణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూను రద్దు చేసింది. ఈ కేసులో అభియోగాలు మోపడానికి కొన్ని గంటల ముందు, సంస్థ యూఎస్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ మార్కెట్లో 20 సంవత్సరాల గ్రీన్ బాండ్‌ను విక్రయించింది. ఇష్యూ మూడు సార్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. కేసు విషయం బయటకు రాగానే ఇష్యూను ఉపసంహరించుకుంది.
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తమపై అభియోగాలు మోపినందున ప్రతిపాదిత డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నామని అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. యూఎస్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్ర ఆరోపణల కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ గతంలో రూ. 20 వేల కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.