న్యూఢిల్లీ: అమెరికా కోర్టుల్లో నడుస్తున్న మూడు అదానీ కేసులను కలిపి, ఒకేసారి విచారణ జరపాలని న్యూ యార్క్ (యూఎస్) కోర్టు నిర్ణయించింది. గౌతమ్ అదానీ ఇండియాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2,029 కోట్ల వరకు లంచాలు ఇచ్చారని, ఈ విషయం యూఎస్ ఇన్వెస్టర్లు, బ్యాంకర్లకు తెలియదని, కాంట్రాక్ట్‌లు పొందడానికి ఫండ్స్ ఎలా సేకరించారో అదానీ గ్రూప్ వివరించలేదని యూఎస్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే.
యూఎస్ వర్సెస్ అదానీ, ఇతరులు (గౌతమ్ అదానీపై క్రిమినల్ కేసు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) వర్సెస్ అదానీ, ఇతరులు (సివిల్ కేసు), ఎస్‌ఈసీ వర్సెస్ కేబనెస్ (ఇతర నిందితులపై సివిల్ కేసు).. ఈ మూడు కేసులను కలపాలని న్యూయార్క్ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ మూడు కూడా గౌతమ్ అదానీ లంచం కేసుకు సంబంధించినవి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరగా తీర్పు ఇచ్చేందుకు, టైమ్ ఆదా చేసేందుకు కేసులను కలిపామని తెలిపింది.
అదానీపై క్రిమినల్ కేసును విచారిస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జ్ నికోలస్ జీ గారఫిస్ ఈ మూడు కేసులను ఇక నుంచి చూసుకుంటారు. ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ న్యూ యార్క్ కోర్టు కిందటి నెల 12న తాజా తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 18 న జడ్జ్ నికోలస్ జీ గారఫిస్‌కు కేసులు అసైన్ చేశారు.