అంబానీని దాటేసిన అదాని

అంబానీని దాటేసిన అదాని

ఇండియా హురున్ రిచ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్

  • భారత్ లో 29% పెరిగిన బిలియనీర్ల సంఖ్య
  • గతేడాది ప్రతి ఐదురోజులకో బిలియనీర్
  • జాబితాలో చేరిన షారూఖ్ ఖాన్, అమితాబ్, జూహీచావ్లా తదితరులు
  • వెయ్యికోట్ల కన్నాఎక్కువున్నోళ్లు 1,539 మంది 
  • చైనాలో బిలియనీర్లు 25శాతం డౌన్

ఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్‌ ఇండియా గురువారం(ఆగష్టు 29) విడుదల చేసింది. ఆ జాబితాలో అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్‌ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. ఆ లిస్ట్‌లో బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ఖాన్‌, అమితాబ్, జూహీచావ్లా, కరణ్​ జోహార్ కు జాబితాలో చోటు దక్కింది. 

ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ కుటుంబం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2024లో టాప్‌లో నిలిచింది. గత ఏడాది భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్‌ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్‌లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు. 

ALSO READ | రిలయన్స్​–డిస్నీ డీల్​కు సీసీఐ ఆమోదం

2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్‌ కామర్స్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు. మొదటిసారిగా బాలివుడ్‌ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దీంతో పాటు  రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ కూడా ఆయనకు కాసులు కురిపించిందనే చెప్పాలి. మొత్తానికి రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. సెల‌బ్రిటీల్లో బాలీవుడ్ న‌టి జూహీ చావ్లా కూడా హురున్ సంప‌న్నుల జాబితాలో చోటు సంపాదించింది. ఆమె సంప‌ద 4600 కోట్లుగా ఉంది. హృతిక్ రోష‌న్ ఆస్తి సుమారు రెండు వేల కోట్లుగా ఉంది. బిగ్ బి అమితాబ్ 1,600 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ సంప‌ద 1400 కోట్ల తో జాబితాలో ఉన్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్టు ప్ర‌కారం భార‌త్‌లో 1539 మంది వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ క‌లిగి ఉన్నారు.

హురున్ ఇండియా రిచ్ జాబితా 2024

1. గౌతమ్‌ అదానీ, ఫ్యామిలీ: 11.6 లక్షల కోట్లు
2. ముఖేష్ అంబానీ, కుటుంబం: 10.1 లక్షల కోట్లు 
3. శివ్ నాడార్, ఫ్యామిలీ: 3.1 లక్షల కోట్లు
4. సైరస్‌ పునావాలా, కుటుంబం: 2.89 లక్షల కోట్లు
5. దిలిప్‌ సింఘ్వీ: 2.49 లక్షల కోట్లు.
6. కుమార్‌ మంగళం బిర్లా: 2.35 లక్షల కోట్లు.
7. గోపిచంద్‌ హిందుజా, ఫ్యామిలీ: 1.92 లక్షల కోట్లు.
8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: 1.90,900 కోట్లు.
9. అజిమ్‌ ప్రేమ్‌జీ, ఫ్యామిలీ: 1.90,700 కోట్లు.
10. నీరజ్‌ బజాజ్‌, కుటుంబం: 1.62 లక్షల కోట్లు