న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అదానీ వ్యాపారాలను తల్లకిందులు చేసింది. గ్రూప్ స్టాక్‌ల పతనం వల్ల ఆయన సంపద భారీ మొత్తంలో తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లోని టాప్–20 ర్యాంక్‌ల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎక్కువ డబ్బు కోల్పోయిన మొదటి ముగ్గురు బిలియనీర్లలో గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ రాధాకిషన్ దమానీ ఉన్నారు. అంబానీ, దమానీతో పోలిస్తే అదానీ నికర విలువలో నష్టం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ఫిబ్రవరి 4 నాటికి, గౌతమ్ అదానీ ఈ సంవత్సరంలో విపరీతంగా డబ్బును కోల్పోయిన సంపన్నుల చార్ట్‌లో మొదటిస్థానంలో ఉన్నారు. తర్వాత ముఖేష్ అంబానీ, రాధాకిషన్ దమానీ ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం, సంవత్సరంలో ఇప్పటి వరకు అదానీ 61.6 బిలియన్ డాలర్లను నష్టపోయారు. దీంతో ఆయన ర్యాంక్ 21వ స్థానానికి పడిపోయింది. కొన్ని వారాల క్రితం ప్రపంచంలోని టాప్ –3 ధనవంతులలో ఉన్న అదానీ ఇప్పుడు నికర విలువ 59 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇండెక్స్‌లో 12వ ర్యాంక్ ఉంది.-- ఫిబ్రవరి 4 నాటికి ఆయనకు 80.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ ఉంది. అంబానీ సంపద ఈ సంవత్సరంలో 6.36 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినప్పటికీ ‘భారతదేశంతోపాటు ఆసియాలో అత్యంత ధనవంతుడు’ అనే రికార్డును అంబానీ తిరిగి దక్కించుకున్నారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) ఫౌండర్ రాధాకిషన్ దమానీ ఈ ఏడాదిలో 2.61 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ప్రస్తుతం ఆస్తుల నికర విలువ 16.7 బిలియన్ డాలర్లు కాగా, 102వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇదే సంవత్సరంలో టెస్లా ట్విటర్ సీఈఓ ఎలోన్ మస్క్ సంపద 37.6 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తం నికర విలువ 175 బిలియన్ డాలర్లతో ధనవంతుల జాబితాలో 2వ ర్యాంక్‌లో ఉన్నారు. లూయిస్ విట్టన్ ఫౌండర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 33.7 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో 196 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ 23.5 బిలియన్ డాలర్లు ఎగబాకడంతో మూడో స్థానంలో నిలిచారు. -- మొత్తం సంపద 69.1 బిలియన్ డాలర్లతో 13వ ర్యాంక్‌ను పొందారు.
షేర్ల విలువలో ఘోర పతనం
ఈ ఏడాది జనవరి 24 నుంచి అదానీ గ్రూప్ ఏడు లిస్టెడ్ ఎంటిటీల స్టాక్‌ల విలువ 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. సంస్థ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ శుక్రవారం 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,017.10కి చేరినా, తరువాత 1.25శాతం పెరిగి ఒక్కొక్కటి రూ.1,584.20 వద్ద ముగిసింది. ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ, మార్కెట్లలో పరిస్థితులు బాగా లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నామని అదానీ ప్రకటించారు. ఫిబ్రవరి 1–2 మధ్య ఈ స్టాక్ 4–7శాతం వరకు పెరిగింది. హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్‌ను విడుదల చేసిన జనవరి 24 నుంచి గ్రూప్ స్టాకులు విపరీతంగా తగ్గాయి. శుక్రవారం మాత్రం కొన్ని అదానీ స్టాక్స్ రికవరీ అయ్యాయి. దీనిపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, "అదానీ ఎపిపోడ్ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించింది. ఫలితంగా చాలా నష్టం జరిగింది. బడ్జెట్ బాగుండటంతోపాటు ఫ్రెంచ్ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ ప్రకటన తరువాత కొంత ఉపశమనం కనిపించింది. అదానీ గ్రూప్ స్టాక్‌లలో పెరుగుదల కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది" అని ఆయన అన్నారు. న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్‌సెల్లింగ్ సంస్థ అదానీ గ్రూపు స్టాక్ మానిప్యులేషన్ చేసిందని, మనీలాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది. ఈ స్టాక్‌లు 85 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. అదానీ గ్రూప్ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.