న్యూఢిల్లీ : వంట నూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ 25శాతం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ రూల్‌కు అనుగుణంగా సంస్థ ప్రమోటర్లు మొత్తం 1.24శాతం వాటాను (1.61 కోట్ల షేర్లను) వచ్చే వారం నుంచి అమ్ముతారని ప్రకటించింది. కంపెనీ ప్రమోటర్లు అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ, లెన్స్ పీటీ ఈక్విటీ షేర్లను విక్రయిస్తామని తెలిపారని అదానీ విల్మార్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ప్రమోటర్లు డిసెంబర్ 26– జనవరి 31 మధ్య కాలంలోని కంపెనీ మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.24శాతం వరకు విక్రయిస్తారు.
సెప్టెంబర్ క్వార్టర్ ముగింపులో, అదానీ కమోడిటీస్‌కు కంపెనీలో 43.97శాతం వాటాను కలిగి ఉండగా, విల్మార్ గ్రూప్‌లోని ఇతర ప్రమోటర్ లెన్స్ పీటీఈకి కూడా 43.97శాతం వాటా ఉంది. ఇద్దరు ప్రమోటర్లకు కలిపి కంపెనీలో 87.94శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం అన్ని లిస్టెడ్ కంపెనీలు కనీసం 25శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనను పాటించాలి.
అయితే కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు పబ్లిక్ ఫ్లోట్ అవసరాలను తీర్చడానికి 3 సంవత్సరాల మినహాయింపును పొందుతాయి. రూ. 3,600 కోట్ల ఐపీఓ ద్వారా అదానీ విల్మార్ షేర్లు ఫిబ్రవరి 2022లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. ఇటీవలి నెలల్లో సంస్థ ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి బయటికి రావడానికి ఇది కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.