హైదరాబాద్ : భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నారాయణగూడలోని ఆదర్శ్ నగర్ బస్తీ వరదనీటిలో మునిగిపోయింది. ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇండ్లల్లోని వస్తువులను తీసుకొని బంధువుల ఇంటికి వెళ్తున్నారు బస్తీ వాసులు. నాలా రీటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వర్షం నీళ్లు బస్తీలోనే నిలిచిపోయాయి. దాంతో బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు సంబంధిత అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేదంటున్నారు. సమస్యను పరిష్కరించడం లేదని చెబుతున్నారు.