ఆదివాసీలను తరిమేస్తారా ?

ఆదివాసీలను తరిమేస్తారా ?

ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వాలు పట్టించుకోకుండా మరచిన సమస్యల్లో  పోడు భూముల సమస్య ప్రధానమైనది ఈ మధ్యకాలంలో కొమరం భీం జిల్లాలో భద్రాద్రి జిల్లాలో  ఈ సమస్య తీవ్రంగా తెరపై కనిపిస్తోంది. ఆదివాసులకు ఫారెస్ట్ అధికారులకు మధ్యన యుద్ధం నడుస్తూనే ఉంది. ఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో ఆదివాసుల భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివాసులు వాళ్ల భూముల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి పోరాడక  తప్పని పరిస్థితిలో ఉన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరిపినట్లయితే ఆదివాసులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. 2006  నుండి  అటవీ హక్కుల చట్టం వచ్చినా ఈ 12 సంవత్సరాలలో  చట్టాన్ని  అమలు జరపడంలో ముమ్మాటికీ పాలకుల నిర్లక్ష్యమే ఉంది ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ ,ఖమ్మం, జిల్లాలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. కొమురం భీం జిల్లాలోని సార్సాలా, భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లిలో, కోలం గొంది గ్రామంలో ఫారెస్ట్ అధికారులకు  పోడు రైతులకు మధ్య జరిగిన సంఘటనలు పోడు భూముల సమస్యని తెరపై చూపించాయి. కానీ ఇంకా తెలియని పోడు సంఘటనలు  ఎన్నెన్నో ఉన్నాయి

పోడు సమస్య :

ఆదివాసీలు పోడు వ్యవసాయాన్ని నమ్ముకొని కొన్ని శతాబ్దాలుగా మరికొన్ని దశాబ్దాలుగా అడవిలో జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివాసుల జీవనానికి అడవికి మధ్య గల సంబంధం వెలకట్టలేనిది విడదీయలేనిది అడవిలో పుట్టి అడవిలోనే పెరిగి అడవితో ఉన్న అనుబంధాన్ని బలవంతంగా తెంచేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. దేశంలో               8 కోట్ల 56 లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉండగా అడవి ప్రాంత  వనరులపై  175000 గ్రామాల్లో 20 కోట్ల మందికి పైగా ఆదివాసులు  అడవి మీద హక్కు లేకుండా జీవిస్తున్నారు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని హక్కులు ఉన్న అడవి నుండి ఆదివాసిని గెంటి వేసే ప్రయత్నంలో పాలక వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నారు.  రాజ్యాంగంలోని 5వ ఆర్టికల్ ప్రకారం ఆదివాసులకు అడవిపైన పూర్తి హక్కు కల్పించడమైంది.  అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం రక్షిత అర్హులైన రిజర్వ్ ఫారెస్ట్ లైన్ అభయారణ్యాల 2005 డిసెంబర్ కన్నా ముందు నుండి  అడవుల్లో నివాసముంటున్న ఆదివాసీలు హక్కులు పొందవచ్చు అక్కడున్నటువంటి గ్రామ సభలకు సర్వాధికారాలు ఉంటాయి ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి  పోడు భూముల్లో కుటుంబానికి పది ఎకరాల వరకు పొందవచ్చు ఈ చట్టం ప్రకారం అటవీ హక్కుల చట్టం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కుటుంబానికి కనీసం రెండు ఎకరాల కూడా పట్టాలు ఇవ్వలేదు కనీసం భూ సర్వే లు కూడా చేయలేదు సక్రమంగా ఈ చట్టాన్ని ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు అమలు చేయడానికి పూనుకోలేదు ఆదివాసీలకు హక్కులు కల్పించడం ఇష్టం లేక అధికారులు సాకులతో  తిరస్కరించారు  దేశవ్యాప్తంగా  44 లక్షల మంది  పోడు పట్టాల కోసం అప్లికేషన్‌ పెట్టుకోగా, ఏపీలో 66,351, తెలంగాణలో 80,875 అర్జీల్ని ఏ కారణం లేకుండా తిరస్కరించారు అధికారులు.  ప్రభుత్వ లెక్కల ప్రకారం పోడు భూములకు పట్టాలు లేకుండా దేశంలో 10 లక్షల మంది ఆదివాసులు ఉన్నారు! నూతన అటవీ చట్టం రూపొందించిన తర్వాత ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని  నీరుగారుస్తు విడివిడిగా చట్టాలు చేసింది అందువల్లే కేంద్ర అటవీ హక్కుల చట్టం రూపొంది 12 ఏళ్లు గడిచినా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా నిజాయితీగా అటవీ భూములను సాగుచేసుకుంటున్న ప్రజలకు పట్టాలు పంపిణీ చేయలేదు కచ్చితంగా ఈ తప్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఆదివాసుల చేత పోడు వ్యవసాయాన్ని మాన్పించడం  కోసం కొన్ని చట్టాలు, సర్క్యులర్ సంరక్షణ బిల్లులు తీసుకొచ్చారు 1981లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన సర్క్యులర్లు 1996లో వన సంరక్షణ సమితులు ఏర్పాట్లు  ఆదివాసుల చేత పోడు వ్యవసాయాన్ని మాన్పించడం  కోసం చేసినవే. ప్రభుత్వ 5 6 షెడ్యూల్ ,పెసా చట్టం1/70, అటవీ హక్కుల చట్టం ఇలా ఎన్ని చట్టాలు ఉన్నా తరతరాలుగా ఆదివాసులకు అన్యాయం జరుగుతోంది.  ఇప్పటికే భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, పరిశ్రమలు,  రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ జోన్ తదితర పేర్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల ఇప్పటికే ఆదివాసీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. తమ  పోడు భూములను కాపాడుకోవాలంటే అటు ప్రభుత్వాలతో ఇటు ఫారెస్ట్ అధికారులతో తెగించి పోరాడుతూనే ఉన్నారు.

– కనికరపు లక్ష్మీకాంతం