న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. గతంలో వేసిన అంచనాలను మార్చలేదు. దేశంలో పంటల దిగుబడి పెరుగుతుందని, ప్రభుత్వం ఖర్చులు కూడా పెరగడంతో రానున్న క్వార్టర్లలో ఇండియా ఎకానమీ మరింతగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ పెరగడం వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఓవరాల్ ఎగుమతులు పుంజుకుంటాయని పేర్కొంది.
కానీ, సరుకుల ఎగుమతుల్లో పెద్దగా గ్రోత్ ఉండదని ఏషియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ వెల్లడించింది. ‘ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా నమోదవుతుంది’ అని ఏడీబీ వివరించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ రేట్ 6.2 శాతానికి తగ్గినా, రానున్న క్వార్టర్‌లో పుంజుకుంటుందని అంచనా.