వైఎస్ఆర్ జిల్లాగా పిలువబడుతున్న కడప జిల్లా పేరును మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ జిల్లాలో కలకలం రేపింది... వైఎస్సార్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలని కూటమి మంత్రి సత్యకుమార్ రాసిన లేఖలో కడప జిల్లా ప్రాముఖ్యతతో పాటు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కలియుగదైవం వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరడానికి తొలిగడప కడప అని.. కడప పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు.
కడప జిల్లా ప్రాముఖ్యత పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరును 'వైఎస్సార్' జిల్లాగా మార్చడం తప్పని అన్నారు సత్యకుమార్. అందుకే కడప జిల్లా ప్రజల మనోభావాల మేరకు జిల్లా పేరుని గెజిట్ లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరానని లేఖలో పేర్కొన్నారు సత్యకుమార్.
వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం అని.. కాబట్టి కడప చారిత్రక నేపథ్యాన్ని, వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ జిల్లాగా పిలవబడుతున్న కడప జిల్లాను "వైఎస్సార్ కడప" జిల్లాగా మార్చాలని కోరారు సత్యకుమార్.
మంత్రి సత్యకుమార్ లేఖపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కడప జిల్లా పేరును తమ హయాంలో మార్చలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని.. 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా జిల్లా పేరును ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మార్చని పేరు ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లా వైసీపీ నేతలు.