హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు సీనియర్లు నేతలంతా తాము కలసిపోయామని ప్రకటించి రెండు రోజులు గడవకముందే మళ్లీ మరో నేత ఫిర్యాదు చేసిన వ్యవహారం దుమారం రేపుతోంది. రాష్ట్ర నేతలందరితో కలసి రాహుల్ గాంధీ సమావేశమైన తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అందరం కలసికట్టుగా పనిచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా సోనియాతో ఫోటో దిగి.. తాను గతం మరచిపోయానని.. భవిష్యత్తుపైనే దృష్టిపెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ముగిసినట్లేననుకుంటున్న తరుణంలో ఇవాళ మరో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సోనియాకు ఫిర్యాదు చేసిన లేఖ వెలుగులోకి వచ్చింది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అసంతృప్త నేతలు సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తే.. మీ కాళ్లు మొక్కుతా.. సమావేశం పెట్టొద్దు.. అందరం కలసి పనిచేద్దామని వేడుకున్న అద్దంకి దయాకరే ఇప్పుడు తాజాగా సోనియాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అంతర్గత విభేదాలు ముగిసినట్లేననుకుంటున్న తరుణంలో అద్దంకి దయాకర్ సోనియాకు ఫిర్యాదు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రెడ్డి పై సోనియాకు ఫిర్యాదు చేశారు అద్దంకి దయాకర్. ఈనెల 6వ తేదీన సోనియాకు రాసినట్లుగా చెబుతున్న లేఖ బహిరంగం కావడం చర్చనీయాంశం అయింది. 2018 ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన వ్యకిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని సదరు లేఖలో పేర్కొన్నారు అద్దంకి దయాకర్.
ఇవి కూడా చదవండి