బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ఏ పార్టీ అయినా తెలంగాణలో నామరూపాలు లేకుండా ప్రజలే చేస్తారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కు కౌంటర్ ఇస్తూ జనవరి 15వ తేదీ సోమవారం దయాకర్ వీడియోను రిలీజ్ చేశారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీకి, టిఆర్ఎస్ కి మధ్య ఉన్న మైత్రిని మరొకసారి బయటపెట్టాయని చెప్పొచ్చన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న అనైతిక రాజకీయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఈ రెండు పార్టీల కంటే అంతకుమించి రాజకీయం చేయగల శక్తి కాంగ్రెస్ పార్టీ ఉందని అద్దంకి హెచ్చరించారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజలే అన్ని విధాలుగా కాపాడుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా.. హాని చేయాలని తలపించిన ప్రజలే సమాధానం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు..