గద్దర్ ఫ్యామిలీకి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి : అద్దంకి దయాకర్

గద్దర్ ఫ్యామిలీకి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి : అద్దంకి దయాకర్
  • కాంగ్రెస్​ నేత అద్దంకి దయాకర్​డిమాండ్​
  • 31న గద్దర్​ జయంతి నిర్వహస్తున్నాం

ఖైరతాబాద్, వెలుగు: ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి ఉత్సవాన్నిఈ నెల31న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు గద్దర్ ​కుమారుడు సూర్యకిరణ్​ తెలిపారు. సీనియర్​జర్నలిస్ట్​ అల్లంనారాయణ, మాజీ ఎమ్మెల్యే క్రాంతికుమార్, ఓయూ నేత మందాల భాస్కర్, కాంగ్రెస్​సీనియర్​నేత అద్దంకి దయాకర్, సినీ దర్శకుడు శంకర్​తో కలిసి సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, గద్దర్ ఫౌండేషన్​ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి ఉత్సవంలో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్​ తాజాగా గద్దర్​పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ఆయన కుటుంబానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్​చేశారు. 

కేంద్ర ప్రభుత్వం తర్వాతైనా గద్దర్​కు పద్మా అవార్డు ఇవ్వాలని కోరారు. ‘బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపించిన వ్యక్తి గద్దర్.. ఆయనకు పురస్కారం ఎలా ఇస్తాం.. ఆయనకున్న అర్హత ఏంటి’ అంటూ బండి సంజయ్​కామెంట్​చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అల్లం నారాయణ, క్రాంతికుమార్​ అన్నారు. అనంతరం జయంతి పోస్టర్​ ను ఆవిష్కరించారు. సమావేశంలో పీఎస్ఎన్ మూర్తి, శ్రీనివాస్​పాల్గొన్నారు.