- పార్వతీ బ్యారేజీకి పోటెత్తుతున్న వరద
గోదావరిఖని/మంథని వెలుగు: ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్మొత్తం 62 గేట్లలో 33 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతుండడంతో గోదావరిలో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది.
సోమవారం ఉదయం 5 గంటలకు 4.40 లక్షల క్యూసెక్కుల వదిలిపెట్టగా, 7 గంటలకు 5 లక్షలు, 8 గంటలకు 5.30 లక్షల క్యూసెక్కులు, 10 గంటలకు 6 లక్షల క్యూసెక్కులు, మధ్యాహ్నం ఒంటి గంటకు 6.51 లక్షల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువకు వదిలిపెట్టారు.
సాయంత్రం 5 గంటల నుంచి కొంత తగ్గించారు. 32 గేట్ల ద్వారా 2.63 లక్షల క్యూసెక్కులు, 6 గంటలకు 2.64 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. అయితే, ఎస్సారెస్పీ నుంచి వరద ఎల్లంపల్లికి చేరితే మరిన్ని గేట్లను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈక్రమంలో మంథని మండలం సిరిపురం సమీపంలోని సుందిళ్ల(పార్వతీ) బ్యారేజీకి భారీగా వరద పెరుగుతోంది.
సుందిళ్ల బ్యారేజీ నుంచి 5,75,004 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఔట్ ఫ్లో 5,75,004 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 74 గేట్లను ఎత్తి ప్రాజెక్టులో నీరు నిల్వ లేకుండా దిగువకు విడుదల చేస్తున్నారు. మంథని పట్టణ పరిధిలోని గోదావరి నిండుకుండలా మారింది. గోదావరినది వరద ఉధృతి కొనసాగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని నదీ పరీవాహక ప్రాంత ప్రజలను పోలీస్, రెవెన్యూ అధికారులు అలర్ట్ చేశారు. నది ఒడ్డున ఉన్న శివుడి విగ్రహం చుట్టూ వరద నీరు చేరింది.