ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు

ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు

హైదరాబాద్, వెలుగు : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక చికిత్సకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాకేజీ ధరలు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన రూ.497.29 కోట్లను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్​ మినిస్టర్​ భట్టి  విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్త చికిత్సా విధానాల కోసం, ప్రస్తుతం ఉన్న పథకాల ఆర్థిక సవరణపై డిప్యూటీ సీఎం సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. ఆరోగ్య శ్రీ కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని, వీరికి  రూ.10  లక్షల వరకు ఆర్థిక సాయం అందుతున్నదన్నారు.  ప్రస్తుతం ఈ పథకంలో 1,672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉండగా.. ఇందులో 1,375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కిందకు రాని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వం పై పడనుంది. అంతే కాకుండా 65 కొత్త చికిత్సా విధానాల కోసం ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు చేయనుంది.