మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్న కొద్దీ మిల్లర్లు రేటు తగ్గిస్తున్నారు. కేవలం 15 రోజుల్లోనే క్వింటాల్‌కు సుమారు రూ. 400 తగ్గించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సీజన్ మొదట్లో క్వింటాల్ సన్నొడ్లకు రూ. 2,300 చెల్లించిన మిల్లర్లు తర్వాత సిండికేట్‌గా మారి రూ. 2,200, రూ. 2,150కి తగ్గించగా, ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 1,900 నుంచి రూ. 1,950 మాత్రమే చెల్లిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ నుంచి మిర్యాలగూడ ఏరియాలోని మిల్లులకు రైతులు సన్నొడ్లను తీసుకువస్తున్నారు. వడ్ల లోడ్‌తో వస్తున్న రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న మిల్లర్లు తాలు, పచ్చగింజ ఉందంటూ రేటు తగ్గిస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మిల్లులకు వడ్లు తెచ్చిన రైతులు తిరిగి వెళ్లలేక కనీసం రూ. 2 వేలైనా ఇవ్వాలని మిల్లుల వద్దే పడిగాపులు పడుతున్నారు.
రైతన్నపైనే హమాలీ, గుమస్తా ఖర్చు
సన్న వడ్ల రేటును భారీగా తగ్గిస్తున్న మిల్లర్లు హమాలీ, గుమస్తా ఖర్చులను సైతం రైతులపైనే మోపుతున్నారు. దీంతో రైతులు లోడ్‌కు రూ. 500 నుంచి రూ. 600 వరకు అదనంగా నష్టపోతున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం గ్రామానికి చెందిన చల్లా ఆంజనేయులు శుక్రవారం 46.30 క్వింటాళ్ల వడ్లను ఓ రైస్‌మిల్లుకు తీసుకువచ్చాడు. దీంతో అతడి వద్ద నుంచి హమాలీ చార్జీ రూ. 469, గుమస్తా ఫీజు రూ. 134, వే బ్రిడ్జి ఫీజు రూ. 90 వసూలు చేశారు. రైస్ మిల్లర్లు తమ ఇష్టం వచ్చినట్లు రేటు ఫిక్స్ చేస్తున్నా ఆఫీసర్లు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.