పెబ్బేరు, వెలుగు: గ్రామాల్లో రోడ్లపైన చెత్త లేకుండా చూడలని, పెంట కుప్పలను తొలగించాలని అడిషనల్ కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు ఆదేశించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో స్వచ్ఛత రన్ నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు ఎవరూ ఇండ్ల ముందు చెత్త వేయొద్దని సూచించారు. ఇంటి పరిసరాలలో మొక్కలు పెంచాలని , ఎక్కడైనా పిచ్చి మొక్కలు ఉంటే తొలగించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, సర్పంచ్ వెంకటస్వామి, డీఆర్డీవో నర్సింహులు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీడీ సుల్తాన్, ఏపీవో అక్తరున్నిస బేగం, టీ ఏ యాదగిరి పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణను అరికట్టాలి
నారాయణపేట, వెలుగు: జిల్లాలో ఇసుక ఆక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మక్తల్ , మాగనూర్ తహసీల్దార్, పోలీస్, ఆర్టీఓ, మైన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు వచ్చే ఆదాయంలో అధిక శాతం రెవెన్యూ ఇసుక నుంచే వస్తుంది కాబట్టి ఇసుక అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజల గృహావసారాలకు ఇబ్బందులు రావద్దన్నారు . మక్తల్, మాగనూర్ నుంచే అధిక శాతం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అందువల్ల ఈ రీచ్ లకు సంబంధించిన రెవెన్యూ, పోలీస్ తో పాటు మైన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గృహావసరాల కోసం ఇసుక కావాలంటే అనుమతులు తీసుకోవాలని సూచించారు. అవసర మైన చోట చెక్ పోస్ట్ లను పెట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశం లో మైన్స్ ఏడీ విజయ్ కుమార్, ఆర్టీఓ వీర స్వామి, డీఎస్పీ సత్యనారాయణ, మక్తల్, మగానూర్ మరియు కృష్ణ తహసీల్దార్లు పాల్గొన్నారు.
విద్య ప్రైవేటీకరణపై పోరాడతాం
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో పీడీఎస్‌యూ 15వ మహాసభలో ఆయన మాట్లాడారు. సమాజ మార్పునకు విద్య కీలకమని, ఆ విద్యను పేద విద్యార్థులకు అందకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. విద్యారంగాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేసి, ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపుతుందన్నారు. పేదలకు విద్యను అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా మారుతీ, ప్రధాన కార్యదర్శి సీతారాం, సహాయ కార్యదర్శిగా చెన్నకేశవులు, కోశాధికారి సంజీవ్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నికయ్యారు.
5 నుంచి అంజన్న బ్రహ్మోత్సవాలు
మక్తల్, వెలుగు: డిసెంబర్ 5 నుంచి పట్టణం లో పడమటి ఆంజన్న బ్రహ్మోత్సవాలు ప్రారం భం అవుతాయని ఆలయ ధర్మకర్త బీమాచార్య తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో శనివారం బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను విడుదల చేయించారు. 11 వరకూ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ వాకిటి శ్రీహరి, ఎంపీటీసీ బలరాంరెడ్డి, టీఆర్ఎస్ లీడర్లు అమరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వల్లంపల్లి మధు, బీజేపీ లీడర్లు బాల్చేడ్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలె
ఉప్పునుంతల, వెలుగు: మండలంలోని మొల్గ ర దుందుభి వాగును బీజేపీ రాష్ట్ర నాయకులు వేముల నరేందర్ రావు, అచ్చంపేట అసెంబ్లీ నాయకుడు శ్రీకాంత్ భీమా శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దుందుభి వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం హామీలకే పరిమితమైందని విమర్శించారు. వెంటనే బ్రిడ్జినిర్మించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, జగపతి రావు, ప్రధాన కార్యదర్శి మహేశ్ యాదవ్, కార్యకర్తలు రవితేజ, మల్లేశ్, అంజి, మల్లేశ్పాల్గొన్నారు.
నలుగురు దొంగలు అరెస్ట్.. 4 బైక్ లు, 4 గోల్డ్ చైన్లు స్వాధీనం
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్‌నగర్‌లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు శనివారం మీడియాతో మాట్లాడారు. మహేశ్ ప్లాన్ చేసి, వేరే వాళ్లతో దొంగతనాలు చేయించేవాడు. ఈ క్రమంలో శ్రీను అనే మరో దొంగతో కలిసి మహేశ్ స్థానిక వడ్డెర బస్తీలో ఇటీవల చైన్ స్నాచింగ్ చేశారు. స్థానికులు డయల్ 100 డయల్ సమాచారం ఇవ్వగా.. మహబూబ్ నగర్ రూరల్ క్రైమ్ పోలీస్ లు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగలు జిల్లా ఆసుపత్రి దగ్గర బైక్ ను వదిలిపెట్టి పారిపోయారు. మెట్టుగడ్డ లో శనివారం ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు విచారించగా..నరేశ్, శ్రీను, ఉశప్పగా పోలీసులు గుర్తించి, అసలు విషయం రాబట్టారు. వీరిచ్చిన సమాచారంతో పాలమూరు యూనివర్సిటీ దగ్గర మహేశ్‌ను పట్టుకున్నామన్నారు. నేరస్తులంతా కర్నాటక యాద్గీర్ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 4 బైక్ లు, 4 బంగారు చైన్లు స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
రాష్ట్ర షూటింగ్ బాల్ పోటీలకు 30 మంది
మక్తల్, వెలుగు: రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు 15 మంది మహిళలు, 15 మంది పురుషులు ఎంపికైనట్టు పీఈటీ గోపాలం తెలిపారు. డిసెంబర్ 2,3న హనుమకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీ లకు ఎంపికైన వారిని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి అమ్రేశ్, విష్ణువర్ధన్ రెడ్డి, బి. రూప, దామోదర్, రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
దళితుల సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యం
వనపర్తి, వెలుగు: దళితుల సంక్షేమానికి కేంద్రం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని దళిత వాడలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల వారికి అంత్యో దయ పథకం ద్వారా ఫలాలు అందుతున్నాయని వివరించారు. మోడీ ప్రత్యేక కృషి కారణంగానే దేశంలో పేదరికాన్ని తగ్గించగలిగారని వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో 12 మంది దళిత మంత్రులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమార్ స్వామి, కార్యదర్శి పరశురాం, ప్రధాన కార్యదర్శి బుడ్డన్న పాల్గొన్నారు.
మరింత ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్, వెలుగు: అలంపూర్ మున్సిపాలిటినీ మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మె ల్యే అబ్రహం అన్నారు. 10 వార్డుల్లో రూ.5 కోట్ల తో సీసీ రోడ్లకు, రూ. 3.5కోట్లతో సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనులకు శనివారం ఆయన పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని అన్నారు.