ఖమ్మం టౌన్, వెలుగు: జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. మొదటి సారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
జిల్లాలో మొత్తం 52 సెంటర్లు ఏర్పాటు చేయగా, 18,403 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. జూన్ ఒకటి నుంచి అభ్యర్థుల హాల్ టికెట్లు టీజీఎస్పీఎస్సీ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9గంటలకే చేరుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేయాలని అధికారులని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, విజయ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. జాన్ బాబు, ఎస్బీఐటీ ప్రిన్సిపాల్ డి. రాజకుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.