- స్థానిక సంస్థల ఆదాయం పెంపునకు ప్లాన్
- పార్కులు, క్రీడా ప్రాంగణాల పెండింగ్ వర్క్స్ స్పీడప్
- మంచిర్యాలలో డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలో పరిష్కారం
- అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్
మంచిర్యాల, వెలుగు: ‘జిల్లాలో అక్రమ లే అవుట్లు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ హెచ్చరించారు. ఇప్పటికే తాండూర్, బెల్లంపల్లి మండలాల్లో నాలుగు ఇల్లీగల్ లే అవుట్లను గుర్తించి రెవెన్యూ అధికారుల సహకారంతో వాటిని తొలగించామని చెప్పారు. ప్రజలు అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, వారి సలహాలు, సూచనలతో మున్సిపాలిటీలు, పంచాయతీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ పలు విషయాలను 'వెలుగు'తో పంచుకున్నారు.
నాలుగు లే ఔట్లను తొలగించాం...
తాండూర్, బెల్లంపల్లి మండలాల్లో నాలుగు లే అక్రమ లే ఔట్లపై కంప్లైంట్స్ వచ్చాయి. వెంటనే రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి పరిశీలించాం. తాండూర్లోని 612 సర్వేనంబర్లో వెలిసిన అక్రమ లే అవుట్ను తొలగించి బోర్డు ఏర్పాటు చేశాం. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలోని 170 పీపీ ల్యాండ్‌లో కొంత మంది ఆరు ఎకరాలు, తాండూర్లోని సర్వే నంబర్ 262లో ఆక్రమించినట్లు ఫిర్యాదులు రాగా, ఆ భూములను స్వాధీనం చేసుకున్నాం. ఎవరైనా గవర్నమెంట్, అసైన్డ్ ల్యాండ్స్‌లో వెంచర్లు చేస్తే సహించేది లేదు. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ యాక్ట్ల ప్రకారం రియల్ ఎస్టేట్ వెంచర్లకు తప్పనిసరిగా డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లే ఔట్ పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు.
అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నాం...
మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాం. కొంతమంది మున్సిపల్ పర్మిషన్ లేకుండానే బిల్డింగ్లు కడుతున్నారు. మరికొందరు టీఎస్ బీపాస్ ద్వారా ఒక ప్లాన్కు పర్మిషన్ పొంది దానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా రూల్స్ఉల్లంఘించి కట్టడాలు చేపడితే యాక్షన్ తీసుకుంటాం. ఇటీవల మంచిర్యాలలో ఒకటి, నస్పూర్లో మూడు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్‌ను గుర్తించి కోటి ఫైన్ వేశాం.
పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై...
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ పనులను స్పీడప్ చేస్తున్నాం. పల్లె పక్రృతి వనాలను ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా పరిశీలించేందుకు సెక్రటరీలకు ఒక లింక్ ఇచ్చాం. వారు నిమిషం నిడివి గల వీడియో తీసి అందులో అప్లోడ్ చేస్తున్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో వాలీబాల్, ఖోఖో కోర్టుల పనులు త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. జిల్లాలో సుమారు 250 శ్మశానవాటికలకు కరెంట్ సౌకర్యం లేదు.
కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడని చోట్ల సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ నిర్వహణను మరింత మెరుగుపర్చుతాం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారేస్తే రూ.500 ఫైన్ వేస్తాం. మంచిర్యాల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు సమస్యను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తాం. శ్మశానవాటిక పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. గ్రామాల్లో దాతల సాయంతో ఫ్రీజర్లు ఏర్పాటు చేస్తున్నాం. నీల్వాయి, మురిమడుగులో ఇద్దరు దాతలు వీటిని డొనేట్ చేశారు.
ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు ఎంకరేజ్మెంట్...
మా పేరెంట్స్ ఇద్దరూ టీచర్లే. దీంతో సహజంగానే నాకు స్కూళ్లు, టీచింగ్‌పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. టూర్లకు వెళ్లినప్పుడు స్కూళ్లను సందర్శించి టీచింగ్ తీరును, స్టూడెంట్ల నైపుణ్యాలను పరిశీలిస్తాను. ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్లలో బాగా బోధిస్తున్న టీచర్లను, మంచిగా చదువుతున్న స్టూడెంట్లను ఇంకా ఎంకరేజ్ చేయాలనిపించింది. ఈమధ్య తాండూర్ మండలం రేచిని, హాజీపూర్ మండలం కొత్తపల్లి స్కూళ్లకు వెళ్లాను. అక్కడి టీచర్లను, స్టూడెంట్లను అభినందిస్తూ స్వయంగా లెటర్లు రాశాను.
మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు...
మున్సిపాలిటీల ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని పలువురు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ లేదు. మరికొందరు రెన్యూవల్ చేసుకోలేదు. వాటిపై దృష్టి సారించాం. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుతాం. పట్టణాల్లోని ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా మరికొంత ఆదాయం వచ్చే అవకాశముంది. సూర్యపేటలో 'వేస్ట్ టు వెల్త్' విధానం సక్సెస్ఫుల్గా అమలవుతోంది. ఈ విధానంపై అధ్యయనం చేసి జిల్లాలో అమలు చేయాలనుకుంటున్నాం.
అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రాపర్టీ టాక్స్, ఇతర బిల్లులు వందశాతం వసూలు చేస్తాం. ఇప్పటికే ఇద్దరు పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రజలు సైతం గడువులోగా పన్నులు చెల్లించి యంత్రాంగానికి సహకరించాలి. అలాగే సెక్రటరీల స్థాయిని తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ యాక్ట్పై 25 ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ తయారు చేసి క్విజ్ పోటీ పెట్టాం. త్వరలో ట్రెయినింగ్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నాం.