- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
- అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఖమ్మం టౌన్, వెలుగు : రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వర్షాల జాగ్రత్తలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. తహసీల్దార్లు, పోలీస్, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని, పరిస్థితులను సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
ప్రమాదకరంగా మారిన కల్వర్టులు, క్యాజ్ వే లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమస్యలు తలెత్తే పరిస్థితి వస్తే, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లను అడ్డుగా పెట్టి రాకపోకలు నిషేధించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రధాన కార్యస్థానంలో వుండేలా పర్యవేక్షణ చేయాలన్నారు.