ఖమ్మం జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్కిల్​ ట్రైనింగ్​ : అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ

ఖమ్మం జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్కిల్​ ట్రైనింగ్​ : అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ

ఖమ్మం, వెలుగు : నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్​ పి.శ్రీజ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. వివిధ శాఖల ద్వారా నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్​మెంట్ కింద చేపట్టే కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలన్నారు.  రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సమ్మర్ లో నెలరోజులపాటు ప్రత్యేకంగా ఈ శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు.

 భవన నిర్మాణ కార్మికులకు స్కిల్ అప్ గ్రెడేషన్, వారి వారసులకు కెరియర్ గైడెన్స్  ఇవ్వాలని చెప్పారు.  రైతు వేదికలను వినియోగిస్తూ ఆధునిక సాగు పద్ధతులు, వివిధ పంటలు, హార్టికల్చర్, వ్యవసాయ అధికారి పరీక్షలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కె.సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్ బాబు, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ వి. విజేత, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. సుజాత, ఐటీఐ ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి

వైరా : ఉపాధి హామీ పనులు చేసే కూలీలు వేసవిలో వడ గాల్పుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ అన్నారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు,  తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.