
అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం, వెలుగు: నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ, కుష్టు వ్యాధిగ్రస్తుల చికిత్స అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో 19 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న పిల్లలందరికి తప్పనిసరిగా మాత్రలు వేయించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో అవసరమైన మేర నులిపురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 1339 మంది ఆశావర్కర్లు, 1739 మంది అంగన్వాడి టీచర్లు, 1260 మంది వైద్య సిబ్బంది నులి పురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గోంటారని అధికారులు తెలిపారు. గ్రామాలలో స్థానిక నాయకులు, పంచాయతి కార్యదర్శులు సైతం తమ గ్రామాలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు మాత్రలు అందేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. బి. కళావతి బాయి, ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణ అధికారి, అడిషనల్ డీఎంహెచ్ఓ డా. వెంకట రమణ, డిఇఓ సోమశేఖరశర్మ, డీడబ్ల్యూఓ కె. రాంగోపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ శ్రీజ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.