ఆడ పిల్లలను కాపాడుకుందాం: హనుమకొండ అడిషనల్ కలెక్టర్

ఆడ పిల్లలను కాపాడుకుందాం: హనుమకొండ అడిషనల్ కలెక్టర్

ఉన్నత విద్యలో ప్రోత్సహించాలి

అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో వక్తలు

హనుమకొండ సిటీ,వెలుగు : ఆడపిల్లల పట్ల వివక్ష తగదని, బాలికలను కాపాడుకుందామని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. ఆడపిల్ల పుడితే రోడ్డుపక్కనే పడేసే రోజులు రావడం బాధాకరమన్నారు. ఆడ పిల్ల వద్దు అనుకుంటే ప్రభుత్వానికి అప్పగించాలని, తప్పుడు చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేదమని, అలాంటివి చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అనంతరం టెన్త్ లో ప్రతిభకనబర్చిన బాలికలకు నగదు బహుమతి అందజేశారు.డీఎంహెచ్ వో సాంబశివరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్ ఉన్నారు.

భ్రూణ హత్యల నివారణకు చర్యలు
వరంగల్‍ కలెక్టరేట్‍: వరంగల్ జిల్లాలో భ్రూణ హత్యల నివారణకు స్కానింగ్‍ సెంటర్లలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వరంగల్‍ కలెక్టర్‍ గోపి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‍లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఏ ఎగ్జామ్ నిర్వహించినా అమ్మాయిలే టాప్​లో నిలుస్తున్నారని, బాలికలను చదివిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్‍ ఆఫీసర్‍ జి.మహేందర్‍రెడ్డి, అడిషనల్‍ కలెక్టర్‍ హరిసింగ్‍, ఉమెన్‍ అండ్‍ చైల్డ్ వెల్ఫేర్‍ ఆఫీసర్‍ శారద, డీఎంహెచ్‍ఓ వెంకటరమణ పాల్గొన్నారు.

ములుగులో మానవహారం..
ములుగు: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లాకేంద్రంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. ఆడ పిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. బాలికలు చదువుతో పాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలన్నారు. ఎవరైనా వేధిస్తే 1098 లేదా 100 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో ప్రేమలత, అడిషనల్ కలెక్టర్​ వైవీ గణేశ్, డీఆర్వో  రమాదేవి, డీఈవో పాణిని, ఏఎల్​వో వినోద తదితరులున్నారు.

ఆడ పిల్లలను చదివించాలి..
మహబూబాబాద్:పుట్టిన ప్రతి ఆడ బిడ్డను చదివించాలని, నేడు అన్ని రంగాల్లో వారే ముందుంటున్నారని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. బాలికల రక్షణకు పెద్దపీట వేస్తామని, బాలికలకు సంబంధించిన చట్టాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈసారి టెన్త్ స్టూడెంట్లకు ‘లిటిల్ లీడర్– లిటిల్ టీచర్’ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా తర్ఫీదు ఇస్తామన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ..
జనగామ అర్బన్ :
జనగామ జిల్లాకేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ శివలింగయ్య వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. బాలికల పట్ల  వివక్షత, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలు, అత్యాచారాలు, బాలకార్మికులు వంటి అంశాలను పోస్టర్ లో పేర్కొన్నారు. వీటిని జిల్లా అంతటా అంటించి అవగాహన కల్పిస్తామని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని, వారు ఎదగటానికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలని తల్లిదండ్రులను కోరారు. డీడబ్ల్యూవో జె. జయంతి, అడిషనల్ ​కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులున్నారు.