నల్గొండ అర్బన్, వెలుగు : ధరణి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో తన ఛాంబర్ లో ధరణి సమస్యలపై జిల్లా అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.
మిస్సింగ్ సర్వే నంబర్స్, పెండింగ్ మ్యుటేషన్స్, కోర్టు కేసులు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. సమస్యలు ఎక్కడున్నాయో గుర్తించి చెక్ లిస్టులో పొందుపర్చాలని తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారంలో ఏ అనుమానం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు.