
రాజన్న సిరిసిల్ల, వెలుగు:- వడ్లను శుభ్రం చేశాకనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. బుధవారం వడ్ల కొనుగోలు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 మద్దతు ధర నిర్ణయించిందన్నారు. రైతుల కోసం జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 172 కేంద్రాలు, ప్యాక్స్ ఆధ్వర్యంలో 57 కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 6 కేంద్రాలచొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సీజన్‌లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో వడ్ల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. సన్నాక సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి, డీసీఎస్‌వో వసంతలక్ష్మి, డీఎం రజిత, అగ్రికల్చర్ ఏడీ రామారావు, జిల్లా కోపరేటివ్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.