- అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల, వెలుగు: కంది పంటను కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం తన చాంబర్ లో కందుల కొనుగోలుపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024--–25 వానకాలం సీజన్ లో రైతులు పండించిన కందులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు.
జిల్లాలోని ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ, పుటాన్ దొడ్డి, గద్వాల మార్కెట్లలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ముందుగా బుధవారం రోజున అలంపూర్, వడ్డేపల్లి మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని సూచించారు సమావేశంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియ నాయక్, మార్క్ ఫెడ్ డిఎం గౌరీ నగేష్, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, ఎస్ డబ్ల్యూ సి మేనేజర్ ఉపేందర్ వివిధ శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.