ఖమ్మం, వెలుగు : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పార్టీలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ పార్టీల లీడర్లతో ప్రచార సభల నిర్వహణ, అనుమతులు, నిబంధనలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ -విజిల్, ఈ -సువిధ యాప్ లను ఈసీ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ- సువిధ యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతులు పొందవచ్చన్నారు.
పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలను సమర్పించాలన్నారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు కమిటీల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మయాంక్ సింగ్, మాస్టర్ ట్రైనర్ శ్రీరామ్, డీఏవో విజయనిర్మల, సహకార శాఖ అధికారి విజయకుమారి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.