నారాయణపేట, వెలుగు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సెక్టార్, జోనల్, రూట్ ఆఫీసర్లు, పీవో, ఏపీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 23, 26 తేదీల్లో రెండు విడతల్లో ఎలక్షన్ డ్యూటీ చేసే ఆఫీసర్లు, సిబ్బందికి మహబూబ్ నగర్ లో ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. జిల్లాలో 205 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ఉన్నారని, వారికి గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో బయట, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, మిగిలిన బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని సరి చూసుకొని, పూర్తి డిక్లరేషన్ తో మహబూబ్ నగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు తరలించాలన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్‌ను పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, జడ్పీ సీఈవో శైలజ, డిప్యూటీ సీఈవో జ్యోతి, డీఎస్పీ నల్లపు లింగయ్య పాల్గొన్నారు.