మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్పీవోలు, అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలోని 492 గ్రామపంచాయతీల్లో 190 ఎంపీటీసీ స్థానాలు, 21 జడ్పీటీసీ స్థానాలకు, 21 ఎంపీపీ, 492 సర్పంచ్, 4,220 వార్డు సభ్యుల స్థానలకు ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, డీపీఆర్వో శ్రీనివాస్ రావు, డీఎస్వో రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.