యూడైస్ పోర్టల్​లో సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలి : అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ

యూడైస్ పోర్టల్​లో సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలి : అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు :  యూడైస్ పోర్టల్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)లో విద్యా సంస్థల సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ ​కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో యూడైస్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలకు, కళాశాలలకు సంబంధించిన సమాచారం ఆన్ లైన్ లో యుడైస్ లో నమోదు చేసే ప్రక్రియ, తదితర వివరాలను అధికారులు అడిషనల్​ కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఉన్నత పాఠశాలలు, కాలేజీలతోపాటు ప్రైవేట్ స్కూళ్ల సమాచారాన్ని కూడా తప్పనిసరిగా అందజేయాలని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లందరికీ ట్రాఫిక్ రూల్స్​పై అవగాహన కల్పించాలన్నారు. 

 ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, జిల్లా యంత్రాంగం కలిసి ప్రైవేటు పాఠశాలల స్కూల్​ డ్రైవర్లకు హెల్త్ చెకప్ చేయించాలని చెప్పారు. ప్రాథమిక పాఠశాలల్లో గుడ్, బ్యాడ్ టచ్ లపై పిల్లలకు టీచర్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ బడుల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని,  ప్రతినెలా మూడో శనివారం పాఠశాలలో పేరెంట్, టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, తరగతి గదుల్లో టీఎల్ఎం ప్రకారం విద్యాబోధన చేయాలని ఆదేశించారు. 

కేజేబీవీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్, ఇతర శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో సోమశేఖరశర్మ, డీడీ సోషల్ వెల్ఫేర్ కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, ఆర్సీవోలు, ఆర్ఎంవో రాజశేఖర్, ఏఎంవో రవి, ప్రోగ్రామ్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. 

వైద్య ఆరోగ్యశాఖ సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలోని మండల కేంద్రాల్లో వైద్యారోగ్యశాఖ సమస్యలపై మీటింగ్ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిల్లా వైద్యాఆరోగ్య కార్యక్రమాలపై ప్రోగ్రాం ఆఫీసర్లతో ఆమె రివ్యూ నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను చేరుకునే విధంగా కొత్త ఆలోచనలు కలిగిన ప్రణాళికలు రూపొందించి అమలు పరచాలని ఆమె సూచించారు.