గ్రూప్ 2 పరీక్షలు పక్కాగా నిర్వహించాలి : అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

గ్రూప్ 2 పరీక్షలు పక్కాగా నిర్వహించాలి : అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా గ్రూప్ 2 పరీక్షలు పక్కాగా నిర్వహించాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15, 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.-30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5-.30 వరకు రెండు సెషన్లలో పరీక్షలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 28,101 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు 85 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశామని తెలిపారు.

 విజయ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. చిన్నయ్య రీజినల్ కోఆర్డినేటర్ 1గా 40 పరీక్షా కేంద్రాలు, ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజకుమార్ రీజనల్ కోఆర్డినేటర్ 2గా 45 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ పని చేస్తుందని తెలిపారు. ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు వీలుగా ఎంపీడీవోలను జాయింట్ రూట్ అధికారులుగా, ప్రతీ 3 నుంచి 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు తహసీల్దారులను ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులుగా నియమించామన్నారు.

 14న పరీక్షల నిర్వహణ పై పరీక్షా కేంద్రాల వారీగా చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, ఏసీపీ ఎన్. నర్సయ్య, రీజినల్ కో ఆర్డినేటర్లు డాక్టర్ వి. చిన్నయ్య, డాక్టర్ జి.రాజ్ కుమార్, జిల్లా వైద్య శాఖ అధికారి బి. కళావతి బాయి, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ ఏవో అరుణ, రవాణా శాఖ, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఎంపీడీవో, తహశీల్దార్లు పాల్గొన్నారు.