ఖమ్మం టౌన్, వెలుగు : గడువులోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లాలోని మిల్లర్లు, రెవెన్యూ, సంబంధిత అధికారులతో ఖరీఫ్, రబీ 2023–04 డెలివరీపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలం పంట కింద 80,903 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీకు గాను 69,592 మెట్రిక్ టన్నుల రైస్, యాసంగి పంటకు సంబంధించి 14 ,757 మెట్రిక్ టన్నుల ధాన్యం డెలివరీకి గాను 7 ,743 మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ చేసినట్లు తెలిపారు.
వానాకాలం, యాసంగి కలిపి జిల్లాలోని రైస్ మిల్లర్లు మరో 18,324 మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ చేయాల్సి ఉందని, వీటిని ప్రభుత్వ గడువులోపు అందించాలన్నారు. ధాన్యం రవాణా సంబంధించి ఏ వాహనాలు ఏ మిల్లులకు అలాట్ చేస్తున్నామో పక్కా సమాచారం ఉండాలని సూచించారు. రైస్ మిల్లర్, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి, రవాణా కాంట్రాక్టర్ సమన్వయంతో పని చేస్తూ ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, మిల్లర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.