కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో వంద శాతం ట్యాక్సులను వసూలు చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య, గృహ, నీటి పన్నులకు సంబంధించిన బిల్లులను పూర్తిస్థాయిలో వసూలయ్యేలా చూడాలన్నారు.
పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 80శాతం వసూలు చేసి, మార్చి చివరి వరకు పూర్తిగా వసూలు చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. వార్డుల వారీగా టీంలను ఏర్పాటు చేసి, ఆయా ఏరియా అధికారులకు విధులు అప్పగించాలన్నారు. సమావేశంలో బల్దియా కమిషనర్ బి.శ్రీనివాస్, డిప్యూటి కమిషనర్ జి.స్వరూపరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.