వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో వచ్చే నెల 3 నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పకడ్భందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పర్యావరణ విద్య, నైతిక మానవ విలువల పరీక్షల నిర్వహణపై రివ్యూ చేశారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి ఫస్ట్ ఇయర్ లో 3,404 మంది, సెకండ్ ఇయర్ లో 3,187 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు సౌలతులు కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు, డీఐఈవో అంజయ్య పాల్గొన్నారు.
స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతల స్వీకరణ
వనపర్తి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా నియమితులైన అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం పూర్తి కావడంతో సోమవారం నుంచి మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా వనపర్తి మున్సిపాలిటీలో బాధ్యతలు చేపట్టారు.