గద్వాల, వెలుగు: సీఎంఆర్ త్వరగా అందజేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 28 రైస్ మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ అందించాలని, లేనిపక్షంలో మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి రోజు 20 ఏసీకేలు అందజేయాలన్నారు. ఖరీఫ్ కు సంబంధించిన సీఎంఆర్ వారం రోజుల్లో 100 శాతం కంప్లీట్ చేయాలని సివిల్ సప్లై డీఎం, డీసీఎస్ వోలను ఆదేశించారు. ఇప్పటి వరకు 68 శాతం బియ్యం సేకరణ జరిగిందని, మిగిలిన 32 శాతం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందన్నారు.
పుటాన్ దొడ్డికి చెందిన లక్ష్మీనరసింహ రైస్ మిల్ నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ రాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో సీఎంఆర్ ఇవ్వకుంటే మిల్లును సీజ్ చేయాలని ఆదేశించారు. డీఎస్ వో రేవతి, జిల్లా మేనేజర్ విమల, ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ కనకయ్య పాల్గొన్నారు.