రిమ్స్‌లో విద్యార్థులపై దాడి.. డాక్టర్‌పై వేటు

 రిమ్స్‌లో విద్యార్థులపై దాడి..  డాక్టర్‌పై వేటు

ఆదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు.  దీనిపై ఎంక్వైరీ కోసం నిజామాబాద్ మెడికల్‌ కాలేజీ నుంచి‌ ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. క్రాంతి కుమార్ అర్ధరాత్రి టైమ్ లో కారులో ముగ్గురు గుండాలను తీసుకొచ్చి విద్యార్థులపై దాడికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు  పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని,  భద్రతా సిబ్బందిని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు

రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో డిసెంబర్ 13 అర్ధరాత్రి కలకలం రేగింది. మెడికల్ క్యాంపస్ గేట్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత క్యాంపస్ లోకి చొరబడ్డారు. అడ్డుగా వచ్చిన విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో విద్యార్థులను కారుతో ఢీకొట్టారు. ఆరుగురు హౌస్‌ సర్జన్లపై దాడికి పాల్పడిన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు హాస్టల్‌ వద్ద ఆందోళనకు దిగారు. దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను గుర్తించగా, ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు.