రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్​ వీరారెడ్డి

రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్​ వీరారెడ్డి

యాదాద్రి, దేవరకొండ( కొండమల్లేపల్లి), మునగాల, మిర్యాలగూడ, వెలుగు : వడ్ల కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్​ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలేరు మార్కెట్ యార్డు సహా పలు కొనుగోలు సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కుప్పలను ఆయన పరిశీలించి తేమ శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకున్నారు. కొనుగోలుకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించడంతోపాటు ట్యాబ్​ఎంట్రీల గురించి ఆరా తీశారు. 

ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి..

తేమశాతం17 కు మించకుండా కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. దేవరకండ మండలం పెండ్లిపాకల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులందరూ తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. 

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి..

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. మునగాల మండలం బరాఖత్​గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం విజయరామపురం, నరసింహులగూడెం, రేపాల గ్రామాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. 

సన్న ధాన్యాన్ని మిల్లర్లు కొనాలి..

రైతులు తెచ్చిన అన్ని రకాల సన్న వడ్లను రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సూచించారు. మిర్యాలగూడ మండలం యద్గార్ పల్లి వద్ద సుమారు 8 మిల్లులను ఆయన పరిశీలించారు. రైతులకు ఎంత ధర చెల్లిస్తున్నారో మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు.