- పూర్తిగా తెరుచుకోని సెంటర్లు
- ఎంఎస్పీ ఇవ్వని వ్యాపారులు
- బోనస్నష్టపోతున్న రైతులు
వనపర్తి, వెలుగు: ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి పంట చేతికొస్తోంది. ఈ నెలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా కొన్నది మాత్రం తక్కువే. కొన్ని మండలాల్లో ఇంకా కోతలు జరుగుతున్నాయి. ఈ సారి ప్రభుత్వం దొడ్డురకం, సన్న రకాలకు వేర్వేరుగానే కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2300 మద్దతుధర ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా వేయగా 3.5లక్షల మెట్రిక్ టన్నులు కొననున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు.
వ్యాపారుల రంగ ప్రవేశం
ఈ సారి పండించిన వరి పంటలో70శాతం వరకు సన్న రకాలే ఉన్నాయి. అందులోనూ బాపట్ల రకంతో పాటు మరో పాతిక రకాల వరకు సన్నాలు పండించారు. ప్రభుత్వం సన్నాల కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇంకా కొన్ని కేంద్రాలలో గన్నీబ్యాగులు, క్యాలిబర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో కొన్ని చోట్ల సన్నాల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.
అంతే కాకుండా సీఎంఆర్ చేయని మిల్లులు, పెండింగ్ ఉన్న మిల్లులకు ఈ సారి వరి ధాన్యం కేటాయించబోమని, వారిని ట్రేడింగూ చేయనివ్వమని ఆఫీసర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి సన్నాలను కొనేందుకు రంగ ప్రవేశం చేశారు. గ్రామాల్లోని రైతుల పొలాల దగ్గరకే వెళ్లి సన్నాలను కొంటున్నారు.
ధర దగా
రైతుల దగ్గరికే వెళ్లి వడ్లు కొంటున్న వ్యాపారులు మద్దతు ధర చెల్లించడంలేదు. ప్రభుత్వం దొడ్డు రకాలకు క్వింటాలుకు రూ.2300 కనీస మద్దతు ధర ప్రకటించగా వ్యాపారులు మాత్రం సన్నాలనే క్వింటాలు రూ.2400-లకే కొంటున్నారు. దీంతో రైతులు ఒక్క క్వింటాలు మీద రూ.400లకు పైగా నష్టపోతున్నారు. అదేమంటే కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం కొంటే అదే ధర ఇస్తామని, తాము రైతుల నుంచి తేమశాతం ఎక్కువగా ఉన్నా కొంటున్నామని అందుకు ధర కాస్త తక్కువ పెట్టామని వ్యాపారులు చెప్పుకుంటున్నారు. కొందరు డిఫాల్ట్ మిల్లర్లు కొత్తగా వ్యాపారుల అవతారమెత్తి రైతుల నుంచే నేరుగా వరి ధాన్యం కొంటున్నారు. కొన్న ధాన్యాన్ని ఇక్కడ మిల్లింగ్ చేసే అవకాశం లేకపోవడంతో కర్నాటకలోని రాయిచూరుకు తరలిస్తున్నారు.
తేలని మిల్లర్ల గ్యారంటీ పంచాయతీ
ఈ సారి సీఎంఆర్కోసం వడ్లు కేటాయించేందుకు మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. డిఫాల్టర్లకు అసలు వడ్లు ఇవ్వడంలేదు. జిల్లాలో 171 మిల్లులుండగా 55 మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించారు. గ్యారంటీ విషయంలో కొన్ని సడలింపులు కావాలని మిల్లర్లు కోరుతున్నారు. సీఎంఆర్కిచ్చే బియ్యంలోనూ దొడ్డు, సన్న రకాలకు ఒకే నిబంధన సరికాదంటున్నారు. మిల్లర్లు వరి ధాన్యం నిల్వ చేయకపోతే అందుకు ప్రభుత్వ పరంగా మార్కెట్ కమిటీ, వేర్ హౌజింగ్ ఇతరత్రా ప్రైవేటు గోదాములు 1.45లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న వాటిని ధాన్యం నిల్వ కోసం అధికారులు గుర్తించారు.