సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్దురిశెట్టి అధికారులతో కలిసి బుధవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద పర్యటించారు. బోనాల జాతరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. రోడ్ల పరిస్థితిని తెలుసుకున్నారు. బోనాల ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్వెంట సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్, సికింద్రాబాద్ తహసీల్దార్రాముల నాయక్, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి ఉన్నారు. అలాగే నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్మీ పెరుమాళ్, మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాంతో కలిసి సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘ భవనంలో ఫలహారపు బండ్ల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు.
జాతరలో మద్యం తాగి, అసభ్య నృత్యాలతో భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఊరేగింపు ఉండాలన్నారు. అడిషనల్డీసీపీ అశోక్, మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, ఉపశంకర్ పాల్గొన్నారు.