- గుర్తుతెలియని నంబర్లకు స్పందించవద్దు
- మోసపోతే 1930కి కంప్లైంట్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్‌లు నమ్మకూడదని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అన్నారు. మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు తెరలేపారని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రెండు గంటల్లో ఫోన్ బ్లాక్ అవుతుందని ట్రాయ్ పేరుతో ఫేక్ కాల్స్ చేస్తున్నారని, అలాంటి కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. ఫోన్ బ్లాక్ అవుతుందని నమ్మించి వ్యక్తిగత వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే పోలీసు అధికారుల పేరుతో ఫోన్లు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదైందని బెదిరిస్తున్నారని తెలిపారు.
అరెస్టు చేస్తామని, కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు పంపాలని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత రెండు నెలల్లో ఇలాంటి ఫేక్ కాల్స్ సంఖ్య బాగా పెరిగిందని, మహిళలు టార్గెట్‌గా మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్లను లిఫ్ట్ చేయవద్దని సూచించారు. ఈ తరహా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా సైబర్ క్రైం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.