హైదరాబాద్, విజయవాడ వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో వెళ్తే జర్నీ సేఫ్..!

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వర్షపు నీరు, వరద నీటితో రోడ్లు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. రహదారులు నదులను తలపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు మరియు నందిగామ వద్ద ఎన్‎హెచ్ 65పై వర్షం నీరు పొంగిపొర్లుతోంది.  సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకని గూడెం వద్ద పాలేరు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ్ పట్టణం దాటిన తర్వాత రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కూడా కూలిపోయింది.

 దీంతో హైదరాబాద్ విజయవాడ, సూర్యపేట ఖమ్మం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో  విజయవాడ, ఖమ్మం వెళ్లే ప్రజలకు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కీలక సూచన చేశారు. భద్రత కారణాల దృష్ట్యా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర ప్రయాణ సహాయం కోసం, ప్రయాణికులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని సంప్రదించాలని.. హెల్ప్‌లైన్ కోసం-  9010203626 నెంబర్‎కు కాల్ చేయాలని సూచన చేశారు. అనివార్య పరిస్థితులలో ప్రయాణం తప్పదనుకుంటే ఈ కింది మార్గాలలో వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు.       

హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే ప్రయాణికులు: 

హైదరాబాద్- చౌటుప్పల్,- చిట్యాల్, -నార్కెట్‌పల్లి, -నల్గొండ,- మిర్యాలగూడ-, పిడుగురాళ్ల, -గుంటూరు-, విజయవాడ

హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే రూట్: 

హైదరాబాద్,-చౌటుప్పల్,-చిట్యాల్-, నకిరేకల్, అర్వపల్లి, -తుంగతుర్తి, -మద్దిరాల, -మర్రిపేడ బంగ్లా, -ఖమ్మం