తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు..

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు..

 తిరుమలలో వైకుంఠఏకాదశి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి.   2025 జనవరి 10 వైకుంఠఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు అనగా జనవరి 10 నుంచి 19 వతేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.   తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శనివారం నిర్వహించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది

వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు.  ఈ టికెట్లను  ( రూ. 300 .. ప్రత్యేక దర్శనం ) ఇప్పటికే ఆన్ లైన్ లో విడుదల చేశామన్నారు.  ఇక శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లు మరియు గదుల కోటాను డిసెంబరు 23న ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తెలిపారు.  - ఆన్‌లైన్‌లో దర్శనం బుక్‌ చేసుకున్న దాతలకు  రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.  సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్‌ చేసుకోవచ్చని ఈవో శ్యామలరావు తెలిపారు. 

ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల వివరాలు

తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. జనవరి13 నుండి 19వ తేదీ వరకు  ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తారు.  సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తిచేశారు.  గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాలని తెలిపారు. 

తిరుపతి, తిరుమలలో కౌంటర్లు

 భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.   కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తామని ఈవో తెలిపారు. 

భక్తులకు విజ్ఞప్తి

దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.  చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేయడమైనది. భక్తుల  రద్దీ దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసిన  10 రోజులలో (జనవరి 10 నుంచి 19 వరకు) విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.. అయితే  ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది.

  • జనవరి 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది.
  • జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
  • జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం 

టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు
 
కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్‌(అలహాబాద్‌) వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని భ‌జ‌రంగ దాస్ రోడ్డు, వాసుకీ ఆలయం ప్రక్కనే గల సెక్టారు 6 నందు శ్రీవారి ఆలయం నమూనా కోసం స్థలాన్ని కేటాయించారు.  ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.  ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తామని . తిరుమలలో మాదిరిగానే శ్రీవారి కళ్యాణాలు జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. 

నవంబరు నెలలో  శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా   రూ.111.30 కోట్లు ఆదాయం సమకూరింది.  ఇంకా లడ్డూల ద్వారా రూ. 97.01 లక్షలు ఆదాయం వచ్చింది.  19.74 లక్షల మంది నవంబర్ నెలలో అన్నప్రసాదాన్ని స్వీకరించగా.. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.