- జేఏసీ చైర్మన్ పరమేశ్వర్
సిద్దిపేట టౌన్, వెలుగు: అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ పరమేశ్వర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట మాజీ జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ నుంచి కలెక్టరేట్ కు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మనుచౌదరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేర్యాల ముఖ్య పట్టణంగా, మున్సిపాలిటీగా, తాలూకా కేంద్రంగా ఉండేదన్నారు.
తర్వాత కాలంలో వరంగల్ జిల్లాలో విలీనం అయినప్పటికీ పంచాయతీ సమితి కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా, తాలూకా కేంద్రంగా ఉందన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆగంరెడ్డి, కళావతి, అశోక్, యాదగిరి, సత్యనారాయణ, కమలాకర్ పాల్గొన్నారు.