కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయ చిరునామా మారుతోంది. ఇకనైనా పార్టీ అదృష్టం మారాలని పార్టీ ఆశావాదుల ఆకాంక్ష! సుమారు అర్ధశతాబ్ది పార్టీకి చిరునామాగా ఉన్న ‘24 అక్బర్ రోడ్’ ఇక గత చరిత్ర!
‘9ఎ కోట్ల రోడ్’లోని ఇందిరా భవన్ ఇకపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ- ఏఐసీసీకి కొత్త చిరునామా! బంగళాలు మారితే రాజకీయ పార్టీల భాగ్యరేఖలు మారి, అవి బాగుపడతాయా? అంత తేలికగా జవాబు దొరకని ప్రశ్న!
కానీ, హేతుబద్ధంగా ఆలోచించేవారు మాత్రం..పెరిగే అవసరాలను బట్టి పార్టీకి కొత్త కార్యాలయాలు వచ్చినట్టే, మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి నాయకత్వ వ్యవహార శైలి, పనితీరు మారాలని కోరుకుంటారు.
తద్వారా పార్టీ బాగుపడే అవకాశాలపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. పార్టీ అగ్రనేతలైన సోనియా, రాహుల్ వంటి వారెవరైనా ఇకపై ఇళ్లనుంచి కాకుండా,కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ నుంచే వ్యవహారాలు నడుపుతారా? అన్నది ప్రశ్న!
సంక్రాంతి తర్వాతి రోజైన జనవరి 15, ఉత్తరాయన పుణ్యకాలంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. రాజధాని ఢిల్లీలో 1978 నుంచి దాదాపు అర్ధశతాబ్ద కాలంపాటు పార్టీ కార్యాలయంగా ఉన్న ‘24 అక్బర్ రోడ్’ నుంచి చిరునామా ‘9ఎ కోట్ల రోడ్’లోని ఆరంతస్తుల ‘ఇందిరాభవన్’కు మారుతోంది.
2009లో సోనియా ఏఐసీసీ నేతగా ఉన్నపుడు లుథియన్స్ ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ (డీడీయూ మార్గ్)లో మొదలైన ఈ భవన నిర్మాణం ఒకటిన్నర దశాబ్దాలు సాగి, ఇప్పటికి ముగిసింది.
నిజానికి ఈ భవనం డీడీయూ మార్గ్‌లోనే ఉన్నా..బీజేపీ, దాని పూర్వరూపం జన్ సంఘ్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరిట కాంగ్రెస్ చిరునామా ఉండటానికి పార్టీ నాయకత్వం ఇష్టపడలేదు.
దాంతో, కోట్ల రోడ్ లోకి తెరుచుకునే బంగళా వెనుక గేట్ నుంచి రాకపోకలు జరిపేలా నిర్ణయించి, పార్టీ కార్యాలయ చిరునామాను ‘9ఎ కోట్ల రోడ్’గా ప్రకటించారు. ఇందిరాగాంధీ కష్టాల్లో ఉన్నపుడు ఆమె గట్టి మద్దతుదారుడైన కాకా వెంకటస్వామి నివాసం ‘24 అక్బర్ రోడ్’ బంగళా, ఒక ప్రత్యేక పరిస్థితిలో కాంగ్రెస్ కేంద్ర కార్యాల యంగా మారింది.స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత దేశరాజకీయాలను శాసించిన కాంగ్రెస్ వ్యవహారాలకు గుండెకాయలా దాదాపు 50ఏళ్లపాటు సేవలం దించింది.
బూడిద నుంచి లేచిన ‘ఫీనిక్స్’...
ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్, ముఖ్యంగా ఇందిరాగాంధీ రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్నపుడు జనవరి- 1978లో శోభన్సింగ్ నేతృత్వంలో 20 మంది పనివాళ్లు.. 5 పడకగదులు, లివింగ్ రూమ్, గెస్ట్రూమ్ తో కూడిన టైప్- 7 క్వార్టర్‌ను శుభ్రం చేశారు. కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శి సిద్ధిక్ అలీ, చీలికవర్గం కాంగ్రెస్‌కు ఏమీ ఇవ్వలేదు.
ఫైళ్లులేవు, పార్టీ జెండాలు లేవు, కాగితాల కట్టల్లేవు, కనీసం టైప్‌రైటర్ కూడా లేదు. ఇందిరాగాంధీ ముఖ్య అనుచరుడైన బూటాసింగ్, ఏఆర్.అంతులే, శర్మ తదితరులు ఖాళీచేతులతో వచ్చి ‘సున్నా’ నుంచి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అన్నీ సమకూర్చుకున్నారు.
1980లో భారీ మెజారిటీతో విజయం తర్వాత, పార్టీ కార్యాలయాన్ని అంతకు ముందరి 7 జంతర్‌మంతర్‌కు మారుద్దామని ఇందిరాగాంధీని ఆమె తనయుడు సంజయ్ గాంధీ కోరితే ఆమె నిరాకరించారు.
‘వద్దు, 7- జంతర్ మంతర్ నుంచి 5- రాజేంద్రప్రసాద్ రోడ్డుకు (1971), అక్కడ్నుంచి 14- అక్బర్ రోడ్డుకు (1978) కాంగ్రెస్ కార్యాలయం మార్చుకోవాల్సిన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాం? ఒకటి కాదు రెండు మార్లు.. పార్టీని నేలమట్టం స్థితి నుంచి పైకి తీసుకువచ్చాను.
ఏమైంది ఈ ఆఫీసుకి? ఇక్కడ (24- అక్బర్‌రోడ్డు) పార్టీకి మంచి భవిష్యత్తుంటుంది. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాలకు ఇదే కేంద్ర స్థానం’ అన్నారామె. ఇందిరాగాంధీ ధీరోదాత్తతకు పై రెండు సందర్భాలు నిదర్శనాలే! పార్టీ కార్యకలాపాలు 24- అక్బర్ రోడ్ కు రావడానికి ముందు 3- జన్‌పథ్, పండిట్ కమలాపతి త్రిపాఠి నివాసం తదితరచోట్ల స్వల్పకాలం సాగాయి.
వెలుగు మరకల జమిలి జర్నీ
24- అక్బర్ రోడ్లో అంతా మంచే జరిగిందనడానికి లేదు. పార్టీ కేంద్ర కార్యాలయం కనుక, రాజకీయంగా కాంగ్రెస్ ఎదుర్కొన్న ఆటుపోట్లకు తట్టుకొని నిలిచింది! వనరుల పరంగా ఏమీ లేనప్పుడు కూడా 1980 వంటి గొప్ప విజయం పార్టీకి దక్కింది.
ఆ క్రమంలోనే పలు ఒడుదొడుకులను పార్టీ చవిచూసింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల దుర్మరణాలు, 1989లో ఓటమి, 1991లో ఏర్పడ్డ పీవీ నర్సింహరావు మైనారిటీ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగటం, 1996 తర్వాత రాజకీయ అనిశ్చితి, 1999 నుంచి అయిదేళ్ల ఎన్డీఏ పాలనలో తప్పని విపక్షపాత్ర, సోనియా, రాహుల్ రూపంలో తల్లీ-తనయుల హయాం మొదలయ్యాక 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలో డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీయే వరుస ప్రభుత్వాల పాలన.. ఇదంతా సినిమా రీళ్లలా తిరిగిపోయిన కాలచక్రం!
కాంగ్రెస్చరిత్రకు ‘24 అక్బర్ రోడ్’ ఆనవాలు
8 గదుల క్వార్టర్ 32 గదులకు, ఇతర నిర్మాణాలకూ నోచుకొని విస్తరించింది. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం క్రమంగా అంతరిస్తూ, పెచ్చుమీరుతున్న పెడధోరణులకూ 24- అక్బర్ రోడ్ ప్రత్యక్ష సాక్షి.
1964లో నెహ్రూ మరణం వరకు గొప్పగా ఉన్న పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం క్రమంగా సన్నగిల్లింది. అప్పట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) ఎన్నికలుగానీ, ఏఐసీసీ ఎన్నికలు, నియామకాలుగానీ సవ్యంగా జరిగేవి.
1969 చీలిక తర్వాత, పార్టీ వ్యవహారాల్లో ఇందిర మీద ఆధారపడటం ఎక్కువైంది. కారణాలేమైనా, పార్టీ మార్గదర్శనంలో కీలకపాత్ర పోషించే ‘సెంట్రల్ పార్లమెంటరీ బోర్డ్’ (సీపీబీ) లేకుండా పోయింది. ఎన్నో సంఘటనలకు సాక్షిగా నిలిచిన ‘24-అక్బర్ రోడ్’ పేరిట ప్రముఖ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ ఏకంగా ఒక పుస్తకమే రాశారు.
కొత్తపేరు సముచితమే!
ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డ జనతా ప్రభుత్వం కక్ష సాధిస్తుందేమోనన్న భయంతో, నాయకులతోపాటు పలువురు మిత్రులు కూడా ఇందిరా గాంధీ కుటుంబానికి దూరం జరిగారు. ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ముఖ్యంగా పార్టీ పునరుద్ధరణ కష్టమైంది.
వారి సొంత ‘మెహ్రౌలి ఫామ్ హౌస్’ ఇంకా సిద్ధం కాలేదు. పదవితోపాటే అధికార నివాసం పోయినపుడు, గాంధీ,- నెహ్రూ కుటుంబానికి విధేయుడైన మహ్మద్ యూనుస్ తన నివాసం ‘12- విల్లింగ్డన్ క్రిసెంట్’ను ఇందిరా గాంధీ ఉండటానికి ఇచ్చారు.
గంపెడు కుటుంబానికే అది సరిపోయి, పార్టీ భేటీలకు చోటుండేది కాదు. పార్టీ కార్యాలయానికి ఎంపీ వెంకటస్వామి తన క్వార్టర్ ఇచ్చారు. ఇదే 24- అక్బర్ రోడ్డులో మయన్మార్ ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమనేత, శాంతిదూత అంగసాన్ సూకీ బాల్యం గడిచింది.
ఆమె తండ్రి అంగసాన్ బర్మా నుంచి భారత రాయబారిగా (1961–- 63) ఉన్నపుడు ఇక్కడ నివసించారు. ఇందిర వంటి ఎందరెందరినో సమీపంగా చూస్తూ స్ఫూర్తి పొండం వల్లే.. హక్కుల కార్యకర్త, ప్రజాస్వామ్యవాదినయ్యానంటారు సూకీ! అటువంటి నేత పేరిట ‘ఇందిరా భవన్’సముచితమే అంటారు ఎవరైనా! అయితే, 1998లో ఏపీ (ఉమ్మడి)లో కాంగ్రెస్ కార్యాలయం ‘గాంధీభవన్’ రూపురేఖల్ని, పీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన డా.వైఎస్.రాజశేఖరరెడ్డి సమూలంగా మార్చారు. అయినా, 1999 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత, ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యాక 2004లో గొప్ప విజయం లభించింది. నేర్చుకునే నేతలు,- కార్యకర్తలకు ఇవన్నీ పాఠాలే!
‘కాకా’ ఇల్లే కాంగ్రెస్ కార్యాలయం అయింది
10- జనపథ్‌లోనే యువజన కాంగ్రెస్ కార్యాలయం (తర్వాత అది సోనియా నివాసమైంది) ఉండటంతో, ఒంటరిగా ఉంటున్న వెంకటస్వామి క్వార్టర్లోకి పలువురు నాయకులు వస్తూ ఉండేవారు.
హెచ్ కేఎల్ భగత్ ఒకరోజు ‘ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఇందిర)’ అన్న చెక్కబోర్డు తెచ్చి గోడకు తగిలించారు. వెంకటస్వామి అది చూసి పులకించిపోయారు. ‘చాలా సంతోషం, మీరు మంచిపని చేశారు. ఇదంతా ఇందిరాగాంధీ ఇచ్చిందే, ఇదీ ఆమెకే చెందుతుంది’ అన్నారు.
అలా మొదలైంది ‘24 అక్బర్ రోడ్’ కాకా బంగళాలో కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం.
--దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్ప్