హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలకు, అభయ హస్తం హామీలకు సరిపడా నిధులను కేటాయించేలా పూర్తి స్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంటున్నది. వచ్చే నెలలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఫుల్ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అవకాశం ఉన్నంతలోనే హామీల అమలుకు నిధులు కేటాయించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో అన్ని గ్యారంటీలు, హామీలకు అవసరాల మేర ఫండ్స్ కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు అవుతున్నాయి. యువ వికాసం గ్యారంటీని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలు ఎక్కించేలా కేటాయింపులు చేయనున్నారు. ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత కింద పెంచిన పెన్షన్లను అందించనున్నారు. రైతు భరోసాకు కొత్త రూల్స్ తెచ్చి.. పెంచిన మొత్తాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్యారంటీలు, హామీలకు నిధుల కొరత లేకుండా ఉండేలా ఆర్థిక శాఖ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల ఆధారంగా ఆదాయం, ఖర్చులపై లెక్కలేసుకుంటున్నారు. ఓటాన్తో చూస్తే పూర్తిస్థాయి బడ్జెట్ పెరగనుంది.
రుణమాఫీ నిధుల సమీకరణపై కసరత్తు
ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే కొన్నింటిని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం అమలు చేస్తున్నది. వాటికి తోడు మరికొన్నింటిని ఫుల్ బడ్జెట్లో ప్రభుత్వం తీసుకురానున్నది. ఇందులో భాగంగా రైతు భరోసాలో రూ.2 లక్షల రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్లో నిధులు ప్రతిపాదించనున్నారు. రైతుభరోసా కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న ఎకరాకు రూ.5 వేలకు అదనంగా ఇంకో రూ.2,500 కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఖరీఫ్, యాసంగి సీజన్లకు రూ.7,500 చొప్పున ఇవ్వాల్సి ఉన్నందున.. భారీగానే బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు. అయితే ఈసారి రైతు భరోసాకు నిబంధనలు విధించనుండటంతో ఎంతమేర ప్రభుత్వ ఖజనాకు ఆదా అవుతుందనేది స్పష్టత లేదు. గత ఆర్థిక సంత్సరంలో అదే రైతుబంధుకు దాదాపు రూ.15 వేల కోట్లు కేటాయింపులు చేశారు.
ఆదాయం పెంపు మార్గాలపై ఫోకస్
గ్యారంటీలు, హామీల అమలుకు పెద్దఎత్తున నిధుల అవసరం పడుతున్నది. దీంతో అందుకు తగ్గట్లుగా రాష్ట్ర సొంత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. భూముల విలువలు సవరిస్తున్నది. ఆగస్టు నుంచి భూముల విలువలు పెరగనున్నాయి. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను ప్రభుత్వం పరిష్కరించాలని అనుకుంటున్నది. మైనింగ్ ఆదాయం పెంచాలని చూస్తున్నది. కమర్షియల్ ట్యాక్స్‌లో లీకులు అరికట్టి.. జీఎస్టీ పెంచేందుకు ఇప్పటికే అనేక ఫ్రాడ్స్ గుర్తించి చర్యలు తీసుకుంటున్నది. ఎక్సైజ్ లోనూ రాబడి పెంచేందుకు ఎలైట్ వైన్స్, బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నది. వీటి ఫలితంగా రాష్ట్ర ఆదాయాన్ని ఇప్పుడున్న దానికంటే 15 శాతం అదనంగా పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది.
అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసాపై పద్దు
రైతు భరోసాపై పద్దు విషయంలో అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో కౌలు రైతులకు కూడా సాయం అందించే దానిపైనా అధ్యయనం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి కేటాయింపులు చేసే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఆరు గ్యారంటీల్లో యువ వికాసంను ప్రభుత్వం మొదలుపెట్టలేదు. దీనికోసం ఈసారి పెద్దఎత్తున నిధులను బడ్జెట్లో పెట్టనున్నట్లు తెలుస్తున్నది. స్కాలర్ షిప్‌లు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ వంటి వాటికి భారీగా ఫండ్స్ అవసరం కానున్నాయి. ఆసరా పింఛన్లు.. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అమలు చేస్తున్నది. ఫుల్ బడ్జెట్లో చేయూత పేరుతో పెంచిన పెన్షన్లు అందించేలా ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై లెక్కలు కడుతున్నది. ఫైనాన్షియల్ ఇయర్లోనే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయంపైనా కసరత్తు చేస్తున్నది. ఒకేసారి మొత్తం కాకుండా.. విడతల వారీగా పెంచుకుంటూ ఇవ్వాలని ఆలోచిస్తున్నది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మొత్తం రూ.2,75,891 కోట్లు పెట్టగా.. అందులో ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయించింది. ఈసారి గ్యారంటీలకు ఇంకో రూ.20 వేల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది.