ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స

  • కార్డు ఉంటేనే సర్కార్ దవాఖాన్ల చికిత్స
  • లేకపోతే సీఎంసీవో లెటర్  తెచ్చుకోవాల్సిందే‌‌
  • ప్రగతి భవన్‌‌లో సీఎంసీవో సెంటర్​
  • లెటర్ల కోసం అక్కడ పేషెంట్లు, వాళ్ల బంధువుల పడిగాపులు
  • చికిత్స కోసం వస్తే తిప్పిచ్చుకోవడం ఏమిటని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: సర్కార్​ దవాఖాన్లలో అడ్మిట్​ కోసం వచ్చే ప్రతి పేషెంట్‌‌ను ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతున్నారు. ఒకవేళ లేదంటే సీఎంసీవో రిఫరల్ లెటర్ తెచ్చుకోవాలని పంపిస్తున్నారు. లెటర్ తెచ్చుకునే వరకూ సర్జరీలు వాయిదా వేస్తున్నారు. ఒక్క నిలోఫర్ నుంచే ఇటీవల ఆరుగురు పేషెంట్లను సీఎంసీవో  లెటర్ల కోసం పంపించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రగతి భవన్‌‌ లోపల ఉన్న సీఎంసీవో సెంటర్​ వద్ద వీళ్లంతా లైన్ కట్టారు. గాంధీ,  ఉస్మానియా తదితర హాస్పిటళ్ల నుంచి మరో 15 మంది పేషెంట్లు వచ్చారు. ప్రైవేటు హాస్పిటళ్ల నుంచి సుమారు 15 మంది పేషెంట్లు వచ్చారు. రోజూ ఇట్లనే పదుల సంఖ్యలో పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల సీఎంసీవో లెటర్ల కోసం ప్రగతి భవన్‌‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ ఇచ్చే రిఫరల్ లెటర్ తీసుకుపోయి దవాఖానాలో ఇస్తేనే ట్రీట్‌‌మెంట్ చేస్తున్నారని బాధితులు అంటున్నారు. 

40 లక్షల కుటుంబాలకు సమస్య

రాష్ట్రంలో సుమారు 1.2 కోట్ల కుటుంబాలు ఉంటే, అందులో 79 లక్షల కుటుంబాల డేటా మాత్రమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వద్ద ఉంది. ఈ లిస్ట్‌‌లో లేని సుమారు 40 లక్షల కుటుంబాల్లో ఎవరికైనా రోగం వచ్చి ప్రభుత్వ దవాఖాన్లకు పోతే వాళ్లు రిఫరల్ లెటర్ల కోసం తిప్పలు పడాల్సి వస్తున్నది. జిల్లాల నుంచి ఈ లెటర్ల కోసం హైదరాబాద్​ వచ్చేవారికి  ఇంకా ఎక్కువ సమస్య అవుతున్నది. ఉదయాన్నే ప్రగతి భవన్‌‌కు చేరుకునేందుకు ముందు రోజు రాత్రే పేషెంట్లను తీసుకుని హైదరాబాద్‌‌కు బయల్దేరుతున్నారు. ఇక్కడికొచ్చి గంటలకొద్ది వెయిట్ చేసి లెటర్లు తీసుకుపోతున్నారు. అసలే రోగంతో ఇబ్బంది పడుతున్నవాళ్లను, రిఫరల్ లెటర్ల కోసం తిప్పడం మరింత బాధపెడుతున్నది. ఫ్రీగా చూడాల్సిన సర్కారు దవాఖాన్లలో ఇట్లా తిప్పించుకోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

2009 నుంచి..

సీఎంసీవో రిఫరల్ లెటర్ల సిస్టమ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమైంది. 2007లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినప్పుడు వైట్ రేషన్ కార్డులతో పథకాన్ని ముడి పెట్టారు. ఈ కార్డు ఉన్నోళ్లందరికీ ప్రైవేటు దవాఖాన్లలో ఉచితంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ పొందే అవకాశాన్ని కల్పించారు. దీంతో అప్పటివరకూ రేషన్ కార్డులు లేని వాళ్లకు, పింక్ రేషన్ కార్డు హోల్డర్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తమకూ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను వర్తింపజేయాలంటూ రేషన్​ కార్డులు లేనివాళ్లు, పింక్​ రేషన్​కార్డు హోల్డర్లు సీఎం క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు రావడం ప్రారంభించారు. దీంతో ఇలాంటివాళ్ల కోసం రిఫరల్ లెటర్లు ఇవ్వడానికి 2009 జులైలో సీఎం క్యాంపు ఆఫీసులోనే అప్పటి సీఎం వైఎస్​ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డు లేని వాళ్లు, పింక్ రేషన్ కార్డు హోల్డర్లకు ఈ లెటర్లతో ప్రైవేటు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ పొందడానికి అవకాశం కల్పించేవారు.  అప్పట్లో గవర్నమెంట్​ హాస్పిటళ్లలో ఇలాంటి లెటర్ల అవసరం ఉండేది కాదు. టెంపరరీగా ప్రారంభించిన సీఎంసీవో సెంటర్​.. అట్లనే కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చాక క్రమేణా రేషన్ కార్డుల జారీ తగ్గిపోవడం, పుట్టిన పిల్లలను రేషన్ కార్డుల్లో యాడ్ చేయకపోవడం వంటి సమస్యలతో ప్రైవేటు హాస్పిటళ్ల నుంచి సీఎంసీవో లెటర్ల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చిన పేషెంట్లను కూడా ఈ లెటర్లు తెచ్చుకోవాలని పంపిస్తుండడంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. రోజూ ఉదయాన్నే పేషెంట్లను తీసుకుని వారి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌ వద్దకు వస్తున్నారు. ప్రగతి భవన్ సిబ్బంది టోకెన్లు ఇచ్చి వీరిని లైన్‌‌‌‌‌‌‌‌లో కూర్చోబెడుతున్నారు. డాక్టర్ల రిఫరల్ లెటర్లు, పేషెంట్‌‌‌‌‌‌‌‌ రిపోర్టులు చూసి రిఫరల్ లెటర్లు జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ మంది వస్తే టోకెన్లు అయిపోయాయని చెప్పి, మరుసటి రోజు రావాలని పంపిస్తున్నారు. సీఎం ఆఫీసు అనగానే కొంత మంది పేషెంట్లు ఇక్కడికి రావడానికి భయపడి, వెనక్కి వెళ్లిపోతున్నారు. 

దవాఖాన దగ్గర్నే ఇయ్యాలె

నా కొడుకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం మా దగ్గరి డాక్టర్లు రిఫర్ చేస్తే నిలోఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చినం. ఇక్కడి డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అడ్మిషన్ రాసిన్రు. అడ్మిషన్ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగిన్రు. మాకు రేషన్ కార్డు ఉందిగానీ, అందులో నా కొడుకు పేరు ఎక్కలేదు. ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు పోయి పర్మిషన్ తెచ్చుకోవాలని డాక్టర్లు చెప్పిన్రు. బుధవారం ప్రగతిభవన్​కు పోతె టోకెన్లు అయిపోయినయ్యన్నరు. గురువారం పొద్దుగాల్ల 6 గంటలకు నా కొడుకును తీసుకుని మళ్లీ అక్కడికి పోయినం. 7 గంటలకు లోపలికి పంపించి, టోకెన్లు ఇచ్చిన్రు. మాలెక్కనే చాలా మంది వచ్చిన్రు. ఉదయం పది గంటల తర్వాత మాకు లెటర్  ఇచ్చిన్రు. దాన్ని తెచ్చి హాస్పిటల్ వాళ్లకు ఇచ్చినం. పేషెంట్లను ఇట్లా తిప్పుడు మంచిది కాదు.. దవాఖాన దగ్గరే లెటర్ ఇయ్యాలె.
- ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళ